పద్మనాభా ! నీకై ఒక్క నెత్తిన కేలి నమస్కారంబు ముంజేతి కంకణంబు నీలాంఛనంబైన తిరుమణివడంబుల జోడు మంగళసూత్రం బితరంబు మాని నిన్నే కొలుచుట పాతివ్రత్య ధర్మంబు నీ దాసుల సంగతి మెలంగుట కులాచారనియమము నీపై భక్తిని నిషకుండొచ్చుట వుంక్కువ ధనంబందుకొనుట నీ దాస్యమే మానంబు కైంకర్యంబు సేయుటే కాపురంబు సేయుట నీ మూర్తి సేవించుటే సదానుభవంబు, నీ ముద్ర ధరియించుట చక్కందనం బాచార్యోపదేశంబు యావజ్జన్మసంపదయని నిన్నుభజించువారు వైష్ణవులు యిటువంటివారలకు నీవు వరదుండవని వింటిని నేను వీరల వాండనే యని చిత్తంబునం బెట్టుమశ్రీ వేంకటేశ్వరా ! మఱియును
తాత్పర్యం : పరమాత్ముడు భర్త; జీవాత్మ భార్య; ఈ సంబంధాన్ని ఈ వచనగీతంలో వ్యక్తీకరిస్తున్నాడు కవి. 'ఓ పద్మనాభా! నీకు మొక్కడానికై చేతులెత్తి చేసే నమస్కారమే - ముంజేతి కంకణం; మెడలో వేసుకునే రెండు తామరపూసలదండలే - మంగళసూత్రం; నిన్నే కొలువడం పాతివ్రత్య ధర్మం; నీ దాసులతో స్నేహం చేయించడం కుల ఆచారనియమం; నీపై భక్తిని ఉంచడమే కన్యాశుల్కం గ్రహించడం; నీకు దాసునిగా పనిచేయడమే అభిమానం (మానంబు); నిన్ను సేవించడమే నీతో కాపురం చేయడం; నీ ప్రతిమను పూజించటమే సదానుభవం; నీ శంఖ చక్ర ముద్రలను ధరించడమే సౌందర్యం; ఆచార్యుని ఉపదేశమే యావజ్జన్మ సంపద; నిన్ను సేవించేవారే వైష్ణవులు. ఇలాంటి వారికి నీవు వరాలను ఇస్తావు - అని విన్నానుశ్రీ వేంకటేశ్వరా! నేను వీరివండీశ్రీ వైష్ణవునినే - అని భావించు స్వామీ.
వ్యాఖ్యానం: డా|| తిరుమఖీ నివాసాచార్య