రాధా మాధవ తత్వం


రాధా మాధవ తత్వం                              - డా|| కె.బి. రాజేంద్రప్రసాద్


రాధామాధవులే రాధాకృష్ణులు. రాధామాధవ తత్త్వం పారలౌకికమైన ప్రణయ తత్త్వం. జీవేశ్వరుల ఆత్మీయతానుబంధ తత్త్వం. ఇది నిత్యం. సత్యం. సనాతనం. శివం. సుందరమైన భక్తి తత్త్వం. ధ్యానంలో కృతయుగం, యాగాల యోగంతో త్రేతాయుగం, నిరంతర అర్చన ఆరాధానలతో ద్వాపరయుగం సాగడం జరిగింది. మాధమ నామ సంకీర్తనామృత ఆస్వాదనతో కలియుగం సాగాలి. అప్పుడే జీవాత్మలు భవబంధాలను వీడి పరమపదం చేరడం జరుగుతుందని భాగవతం సెలవిస్తోంది. అందుకే అచ్యుతుడైన దేవదేవుడు కృష్ణునిగా ద్వాపరయుగంలో ఎలా భాగవతుల హృదయ మందిరాలలో కొలువై, వారికి కైవల్య మార్గాన్ని చూపాడో తెలియవలసి యుంది. అందుకే రాధాకృష్ణుల మధ్య గల ప్రణయ బాంధవ్యం, భక్తి రసార్దృతలను, వారి చరిత్ర చరితలను ఒకింత సమీక్షించుకొందాం.


"రాధా మాధవ రతి చరితమితి - బోధావహం శ్రుతి భూషణం" అన్నారు అన్నమయ్య. "రాధాకృష్ణుల శృంగార చరితము బోధింపతగింది. వీనులకు అలంకారమైంది. అనగా ఆనందంగా వినదగింది. లేదా విని ఆనందాన్ని పొందదగింది" అని భావన. ఆత్మే పరమాత్మ. శరీరంలో ఉంటే ఆత్మ. శరీరం వీడితే పరమాత్మ. "జీవో బ్రహ్మవనాపరః" జీవుడే దేవుడు.


వేరుకాదు. అయితే పాంచభౌతికమైన దేహం ధరించిన జీవుడు కర్మలు చేస్తాడు. దేవతలు అవతారాలెత్తినా, మానవుడు వివిధ జన్మల ద్వారా విభిన్న శరీరాలు ధరించినా అంతటికీ కర్మే కారణం. కర్మలు శిథిలమైతే ఇంక జన్మ లేదు. అదే పునరావృత్తి లేని కైవల్యం. తిరిగి జన్మలేని, రాని మోక్షం కోరదగింది. అక్షర పరబ్రహ్మ యైన పరమాత్మ ఆది స్రష్ట. ఆ దివ్యతత్త్వం సంకల్ప మాత్రంతో స్త్రీమూర్తిని సృష్టించి, ఆమెతో రాసక్రీడాలోలుడై కాలం కరగించాడు. ఫలితం ఆ స్త్రీమూర్తి గర్భవతియై ఒక అండాన్ని ప్రసవించింది. తానేదో బిడ్డకు జన్మనిస్తున్నానని భావించి భంగపడింది. నిరాశా నిస్పృహలతో ఆ అండాన్ని నీటిలోకి విసిరేసింది. నిజానికి ఆ అండమే సృష్టి ఫలానికి మూలం. పరమాత్మకు కోపం కల్గింది. "నీవు గొడ్రాలివైపోతావు. నీ అంశతో పుట్టిన దేవతా స్త్రీలు కూడా గొడ్రాళ్ళే అవుతారు" అని శపించడం జరిగింది. కాలగమనంలో ఆ స్త్రీమూర్తియేశ్రీ లక్ష్మి, రాధ అనే రెండు రూపాలుగా మారగా, అక్షర పరబ్రహ్మ విష్ణువు, కృష్ణుడు అనే రెండు రూపాలు పొందాడు. విష్ణువు లక్ష్మీమాతతో వైకుంఠం చేరగా, కృష్ణుడు రాధతో గోలోకం చేరాడని, రాధ రోమకూపాలనుండి, కృష్ణుని రోమకూపాలనుండి గోపికా గోపాలురు జన్మించారని దేవీ భాగవతం సెలవిస్తోంది. రాధమ్మకు సంతానం ఉండదు. అలాగే రాధ రోమకూప సంజనితులైన వారికిని సంతానం లేదు. ఇది పైన అక్షరపరబ్రహ్మ ఇచ్చిన శాపం.


అయితే ఈ శాపానికి ఒక ప్రబల కారణం ఉంది. నిజానికి రాధ ఇంద్రాణి. అనగా శచీదేవి. ఒకమారు ఈమె వైకుంఠానికి వెళ్ళి మనోహరమైన విష్ణురూపాన్నూ చిపరవశయై "స్వామీ!తొడపై కూర్చోవాలని మనసు పడుతున్నాను" అందట. అప్పుడు స్వామి "నీకు ఆ భాగ్యాన్ని భూలోకంలో అనుగ్రహిస్తా"నని అన్నాడట. అలా శచీదేవి ముందుగా కృష్ణప్రియగా ఉండి అండాన్ని ప్రసవించి, నిరాశా నిస్పృహలతో అండాన్ని విసరివేసి, పరమాత్మ శాపానికి గురియై చివరకు వృషభానుని కుమార్తెగా గోకులంలో జన్మించింది. పరమాత్మ సృష్టించిన స్త్రీమూర్తి రాధగా, కృష్ణప్రియగా పేరొందింది. శృంగార కేళీవిలాసంలో పుట్టి, స్వామి ముందు ధావనం అనగా పరుగు పెట్టింది కనుక రాధయైంది. శృంగారలీలావిలాసమేరాసము. రాసకేళి.రాసము నుండి పుట్టిన పరమాత్మ ఆరాధనలో, సాధనలో, శోధనలో మమేకమై సదా స్వామి ప్రణయారాధనలో పారవశ్యతను పొంది తరించిన ధన్యజీవి రాధమ్మ. కన్నయ్యకు తన గుండెలో గుడి కట్టుకొంది. ఆమె ప్రాణం, ప్రణవం, ప్రణుతి, ప్రణామం సర్వం అక్షరపతియైన అచ్యుతుడే. రాధాకృష్ణుల ప్రణయం ఒక ఆధ్యాత్మిక మ మందిరం. జీవేశ్వరుల సమగ్ర సుందర సంయుక్త రూపం. అది భాగవత హృదయ పద్మ మకరంద మాధుర్యం. ఇది అనుభవేకవేద్యం. బోధ్యం కానిది.


భక్తి యుక్త దాస్యమునూ పదగిన పరమాత్మ కృష్ణుడు. సంకల్పంలో సమస్త విశ్వాలను శాసించగల్గినవాడు. కర్షణ, సంకర్షణలు గలవాడు. మోహనరూపుడు. మధురాధిపతి. ఆకర్షణతోనే అహాన్ని అణచి, ఆత్మీయతా స్పూర్తిని, దీప్తిని నింపేవాడు. జీవాత్మలను ఆనందపెట్టేవాడు. జీవాత్మలకు ఆనందాన్ని ఇచ్చేవాడు. అలంకారప్రియుడు. అర్చనాలోలుడు. గానానికి కరిగేవాడు,కనికరించేవాడు.స్వామి రామావతారంలో మహర్పులు "కౌగిలించుకోవాలని యుంది ప్రభూ" అని కోరితే, వారికి కృష్ణావతారంలో గోపికాజన్మ భాగ్యాన్ని ప్రసాదించి, వారి మనోరథాన్ని తీర్చి, భక్తజనానికి పరమాత్మ ఆరాధనా వైశిష్ట్యాన్ని ఆవిష్కరించూ పినవాడు కృష్ణుడు. అలాంటి కృష్ణునకు గతజన్మల కర్మఫలంగా రాధ మేనత్తగ, వృషభానునకును కళావతికిని కుమార్తెగ పుట్టింది. ఇది బ్రహ్మవైవర్త పురాణం సెలవిస్తోంది. అయినా రాధ కృష్ణుని మోహించింది. కారణం కృష్ణయ్యలోని పరమాత్మతో ఈ జీవాత్మ బంధాన్ని అల్లుకొంది. జన్మగంధాలు, కర్మబంధాలు ముడిపడి రాధాకృష్ణుల ప్రణయానికి దారి తీసింది. వీరిది దాంపత్యానుబంధంగా ఎవరూ చెప్పలేదు. మరి వీరి ప్రణయ లోకానికి ఆదర్శమెలా అవుతుంది? అన్నది ప్రశ్న. ఇది సామాన్యుల ప్రశ్న. పరమాత్మ పరిష్వంగం కోరిన పరమ ఋషులకు ఇలాంటి ప్రశ్న ఎదురు కాలేదు. అక్కడ ఆత్మ పరమాత్మల యోగ సందర్శనంగా భావించాం. మరి ఇక్కడ కూడా అంతే. కాదు అంతకన్నా ఎక్కువ. ఏ భాగవతుడైనా తన కోసం లేదా తనవారి కోసం లేదా తన సమాజం కోసం లేదా తన విశ్వం కోసం పరమాత్మను భజిస్తున్నాడు. ప్రార్థిస్తున్నాడు.


ప్రణామాలు చేస్తున్నాడు. "స్వామీ! నీ దర్శనం నాకు కావాలి. నీ పరమ పదాన్ని చేరాలి" అని ఆరాటపడుతున్నాడు. కాని రాధ అలాకాదు. తనకోసం, తనవారి కోసం కాదు కృష్ణయ్యను ధ్యానించింది, సేవించింది. స్వామికి ఆనందం కల్గించాలి. స్వామికి సంతృప్తి కల్గాలి. జీవుడు దేవుని కొఱకే. జీవులు దేవుని సంపద. ఈ సంపద దైవానికి అర్పణం కావాలి. దైవానికి ఎలా అర్పణం కావాలి? ఆత్మలో పరమాత్మకు మందిరం కట్టి ఉపాసించాలి. జీవుల ప్రణయారాధనతోనే దైవం బలాన్ని, ఫలాన్ని సమకూర్చుకుంటూ విశ్వసృష్టికి, విశ్వతుష్టికి, మొత్తంగా విశ్వకళ్యాణానికి తెర తీయడం జరుగుతుంది. అందుకే కృష్ణయ్యలోని అందం, ఆనందం, ఆత్మీయతల రూపమే రాధ. రాధమ్మ కృష్ణయ్య కోసమే పుట్టింది. తన ఆత్మను కృష్ణయ్యకే అర్పణ చేసుకొంది. ఇదే మధురభక్తి లోని మర్మం. శరీర స్పృహలేని, ఐహిక బంధ రహితమైన ఆత్మలు పరమాత్మ పరిష్వంగ భాగ్యంకై పరితపించడం. ఇక్కడ పరిష్వంగమే యోగం. ఆత్మ పరమాత్మల సమైక్యతా భావన. ఇదొక భక్తి అనుభూతి. పారలౌకికమైన విభూతి. జీవేశ్వరుల శృంగార రీతి. అద్వైత భక్తిభావనా నీతి. భాగవతులకు తిపాత్రమైన భక్తి నియతి.


కనుకనే రాధాకృష్ణుల మ పవిత్రం. ఆదర్శం. రాధాకృష్ణుల రసవత్తరం, రసమయమైన రాసక్రీడనకూ చి దేవతలు తరించారు. గంధర్వులు గానం చేశారు. కిన్నెరలు సంగీతనాదాలు చేశారు. కింపురుషులు పూలవానలు కురిపించారు. అందునా స్వామి వేణుగానలోలుడు. శృంగార హృదయుడు. ద్రవరూపమైన రాధాదేవియే గంగానదియై లోకాన్ని తరింపచేస్తోందన్న అపశ్రుతి కూడా ఒకటి ఉంది. భారతం, భాగవతం, హరివంశాదులు గోపికల రాసక్రీడను వర్ణించాయి కాని రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. పురాణాలలో దేవీ భాగవతం, బ్రహ్మవైవర్తపురాణం రాధచరిత్రను చక్కగా వివరించాయి. జయదేవుడు లీలాశుకుడు, అన్నమయాది వాగ్గేయకారులు రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దపీటనే వేశారు. సృష్టికి మూలమైన ప్రకృతి పంచకంలో దుర్గా, లక్ష్మీ, సరస్వతీ, సావిత్రిలతో పాటు రాధను కూడా చేర్చడం విశేషం. మూల ప్రకృతి నుండి ఉద్భవించిన రెంఉ ప్రధాన శక్తులే రాధ, దుర్గాదేవులని దేవీ భాగవతం చెప్తోంది. కృష్ణయ్య ప్రాణాలకు అధినేత్రి రాధ కాగా, దుర్గ కృష్ణయ్య బుద్ధికి అధిష్ఠాత్రి అన్నారు. రాధమ్మను అర్చించకుండా కృష్ణయ్యను పూజించే అధికారం లేదు. "శ్వేత చంపక వర్ణాభాం శరదిందు సమాననామ్" అంటూ సామవేదం రాధా ధ్యానం చేయడం విశేషం. తెల్లని సంపెంగ పూవన్నెగలతనువు, శరత్కాలచంద్రునివలే ప్రసన్నమైనవదనం, నిత్యయవ్వని, గోపీమండల నాయకి, కృష్ణ ప్రాణాధికురాలు, వేదప్రబోధిత యైన పరమేశ్వరీ శక్తి, రాసమండలేశ్వరి, భక్తులను అనుగ్రహించే దేవి రాధమ్మ" అంటూ వర్ణించడం విశేషం. "సంసార సాగరం నుండి ఉద్దరించే తల్లి"గా కూడా పురాణాలు రాధమ్మను వర్ణించాయి.


ఇంక జయదేవుడు మధురభక్తి తత్త్వం నిండిన హృదయంలో రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దపీట వేసి గీతగోవిందానికి తెరదీశాడు. "మనసా రమయంతం" పరమాత్మయైనశ్రీ కృష్ణ పరమాత్మను మనస్సుతోనే అనుభవించిందట రాధ. ఇదే రాధమ్మ పరమాత్మ సంయోగానందానుభూతి. పరమాత్మ ఎక్కడున్నాడు? ఆ తల్లి ఆత్మలోనే యున్నాడు. రాధ ప్రియసఖి కృష్ణయ్యకు చెప్తోంది. "ప్రభూ! రాధమ్మ


"తలచుచు మదిలో గల నీ మూర్తిని గొలచుచు తాను తపించు విలవిల యేడ్చుచు కలకల నవ్వుచు కలగుచు నిను ధ్యానించు నీ విరహమ్మున దీన"


అంటుంది. "సావిరహే తవదీనా రాధా" అన్న జయదేవుని అష్టపదికి తెలుగుసేత పై గేయం. స్వామి కూడా "ప్రియే చారుశీలే... దేహి ముఖకమల మధుపానం" అందమైన శీలంగల ఓ ప్రియా! నీముఖకమల మకరందాన్ని దేహి" అనుగ్రహించమన్నాడు. అంతటితో ఊరుకొనలేదు త్వమసి మమ భూషణం - త్వమసి మమ జీవనం" ......... "క్ష్యమతామపరమ్" సుందరీ నన్ను క్షమించు. నీవే నా జీవనం. నా అలంకారం" అంటూ అనునయిస్తాడట. రాధయూ స్వామి విరహాన్ని అనగా ఎడబాటును ఇంకా చెప్పాలంటే స్వామి సాన్నిహిత్యపు ఎడబాటు భరించలేదు. సదా గోపికా మానసచోరుడు తన హృదయంలోనే ఉండాలి. అందుకే ఆమె "హరిరితి హరిరితి జపతి సకామం" స్వామికి దూరంగా ఉండలేక మరణిస్తుందేమో నన్నట్లు "సకామం" పరమాత్మపై గల మక్కువ లేదా పరమాత్మతోనే నేను ఉండాలన్న కోరిక కొద్దీ హరినామ జపాన్ని చేస్తుందట. ఇది నిజమైన ఋజువైన ఆత్మ పరమాత్మల అద్వైత ప్రణయతత్త్వ ఆవిష్కారం. కనుకనే రాధామాధవుల మ కథలు, గాథలు, చరితలు, సన్నివేశాలు మధురం. మధురాతి మధురం.


కావున రాధాకృష్ణులు ఆలుమగలు కాదన్నది నిజం. ఆత్మ పరమాత్మల సమైక్య యోగం అన్నది నిజం. ఆధ్యాత్మికం అనంత ఆనంద సంధాయకమన్నది నిజం. మ తత్త్వమే. జీవుడు దేవుని మార సేవించడం. జీవాత్మ తన అధినాయకుడైన పరమాత్మ సేవలో తనను తాను అర్పణం కావించుకోవడం. లౌకికమైన శారీరక శృంగారం కాదది. లౌకికమైన దానికి ఫలం భవసాగరం, సంసార సాగరం. పారలౌకికమైన పరమాత్మతతో ప్రణయం లేదా శృంగారం కైవల్య కారకం. నిష్కామ కర్మయోగంతో భక్తిని మగా మలచుకొని, పరమాత్మను తృప్తిగా ఎదనిండా నింపుకొని, జీవుడు నిశ్చలంగా నిర్మలంగా తనను తాను అర్పించుకొని ముక్తిని పొందడం. ఇదే భాగవతులు సమాజానికి నేర్పింది. బోధించింది. పరమాత్మ అనన్య భక్తితోనే చిక్కుతాడన్న గీతావాక్య భావన ఇదియే. చంద్రుడొక్కడే చకోరాలెన్నో - సూర్యుడొక్కడేమా చూ డ్కులెన్నో - బృందావన పరంధాముడొక్కడే భాగవతులెందరో... అందరికీ అభివందనాలు. వేణుగానంలో రాధ. రాధ ఆరాధనలో మాధవుడు. రాధా మనోహరుడు మాధవుడు. మాధవుని హృదయ మహారాజ్జి రాధ. ఇద్దరూ ఇద్దరే. జీవేశ్వరుల విచిత్ర శృంగార యోగానికి ప్రణమిల్లుదాం.