భగవద్గీత


ఒకసారి మనం పంచ సూనాలు గురించి చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక రంగంలో పునరుక్తి దోషం కాదు. మళ్ళీ ఒకసారి అనుకుందాం. 1. ధాన్యం దంచేటప్పుడు, బోరింగులు వేసేటప్పుడు ప్రాణిహింస జరుగుతుంది. 2. విసురుతున్నప్పుడు, మిక్సీ, వాషింగ్ మెషీన్ తిరుగుతున్నప్పుడు సూక్ష్మజీవులు చస్తాయి. 3. పొయ్యి వెలిగించేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు కాలిపోతాయి. 4. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు కొన్ని జీవులు చస్తాయి. 5. వేడినీళ్ళు కాచేటప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు కంటికి కనబడని సూక్ష్మజీవులు చస్తాయి. ఈ పంచసూనాలకు దోష పరిహారార్థం పంచ మహాయజ్ఞాలు ఆచరించమన్నారు.


1. దేవ యజ్ఞం - ఇష్టదేవతా పూజ. 2. రుషి యజ్ఞం - అపూర్వమైన వేద వాజ్మయం రామాయణ భారతాదులు అందించిన రుషి రుణం తీర్చుకోవాలి. వాటిని చదవటం, ఇతరులకు చెప్పటం. 3. పితృయజ్ఞం - తల్లి తండ్రి తాత ముత్తాతలకు తర్పణాదులు వదలటం, తద్దినాలు పెట్టి, జన్మనిచ్చినందుకు సంవత్సరానికి ఒకసారి వారిని స్మరించటం. 4. మానవ యజ్ఞం - అతిథులకు అభ్యాగతులకు ఆకలిగొన్నవారికి కడుపార అన్నం పెట్టి తృప్తి పరచటం. 5. భూతయజ్ఞం - పశుపక్ష్యాదులకు తిండి పెట్టటం. అలా మనం తెలిసో తెలియకో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయా పనులు చేయాలి. ఆ పాపం నుంచి బయటపడాలి. త్రిగుణాత్మకమైన దోషాలు కర్మాచరణలో ఉన్నప్పటికీ శాస్త్ర సమ్మతాలైన కామసంకల్ప వర్షితాలైన కర్మలన్నీ జ్ఞానాగ్నిలో భస్మమైపోతాయి (4-19). బాగా మండుతున్న అగ్ని సమిధల్ని భస్మం చేసినట్లు జ్ఞానం అనే అగ్ని సర్వకర్మల్ని భస్మం చేస్తుంది (4-37).


మనలో మాట - నహి కశ్చిత్ క్షణమపి. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ప్రపంచంలోని ఏ మనిషీ ఉండడు కదా (3-5). అందరూ కర్మ చేస్తున్నప్పుడు మరి మన దేశానికి మాత్రమే కర్మభూమి అని ఎందుకు పేరొచ్చిందని ప్రశ్న. ఇతర దేశాలకి, మన దేశానికి కర్మాచరణలో కొద్ది తేడా ఉంది. మన పరమపురుషులు ఒక నియమం పాటించారు. నేను చేస్తున్నా, నాకోసం చేస్తున్నా అని అహంకార మమకారాలు వదిలిపెట్టాలన్నారు.కర్మఫలం మీద కూడా అధికారం లేదన్నారు. భగవత్ ఆజ్ఞగా పరమాతఫ్రీ త్యర్థం కర్మలాచరించాలన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే ఏ పని చేసినా కృష్ణార్పణం బ్రహ్మార్పణం అనాలన్నారు. లోకహితం కోసం కర్మలు చేయండన్నారు. కనుక మనది కర్మభూమిగా పరమరుషులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా పరిగణించబడిందని విజ్ఞుల అభిప్రాయం.


ఇంతవరకు కర్మయోగ విచారణ సాగింది. ఇక్కడినుంచి ఆరు శ్లోకాల్లో జ్ఞాన (సాంఖ్య) యోగ విచారణ చేస్తాడు భగవానుడు. కర్మయోగం (ప్రథమ షట్కం) భక్తియోగం (ద్వితీయ షట్కం) జ్ఞానయోగం (తృతీయ షట్కం) అని 18 అధ్యాయాలను మూడు భాగాలుగా విభజించారు. ప్రథమ ద్వితీయ షట్కాల్లో మిగిలిన శేషాంశాల్ని వివరిస్తుంది తృతీయ షట్కం అన్నారు కొందరు. కర్మ భక్తి యోగాలను జ్ఞానయోగంతో సమన్వయం చేయటమే తృతీయ షట్కం అన్నారు కొందరు. ఎవరు ఎలా చెప్పినా అంతా భగవత్ ఉపదేశం కనుక దోషం లేదన్నారు కొందరు. ఏం చెప్పినా బుర్రలోకి ఎక్కించుకొని ఆచరించాలి. అనుష్ఠానం వల్ల తెల్సుకున్న దానికి సార్థకత సిద్ధిస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి మనం. అపుడే భగవద్గీత మన గీతని మార్చగలదు.


జయించినవాడు, ఏ కోరికలు లేనివాడు సర్వ కర్మఫల త్యాగంతో సర్వోత్కృష్టమైన నిషియమైన ఆత్మస్వరూప సిద్ధిని పొందుతాడు. నాది, నాకోసం అనే అహంకార మమకారాలు లేని స్థితిని అసక్తబుద్ధి అంటారు. సంగం త్యక్త్వా కరోతియః | లిప్యతేన పాపేన పద్మపత్రమివాంఛసా. సర్వకర్మలు భగవదర్పితం చేస్తాడు. ఆసక్తి లేకుండా కర్మలాచరిస్తాడు. అలాంటి వానికి తామరాకుమీది నీటిచుక్కల్లా పాపాలంటవు (5-10). పనసపండు వలిచేటపుడు చేతికి నూనె రాచుకోవాలి. అపుడు పాల జిగురు చేతికి అంటుకోదు. అలా కర్మలు చేస్తున్నా నేను కాదు చేసేది, పరమాత్మనాతో చేయిస్తున్నాడు అన్న భావన ఉంటే చేసే కర్మలు బంధంలో పడవేయవు. మళ్ళీ జన్మలకు వచ్చేది ఉండదు.


నీళ్ళలో కొట్టుకుపోతున్న జింకపిల్లను రక్షించాడు జడభరతుడు. అక్కడితో చేతులు దులుపుకుని ఉంటే సరిపోయేది. కాని తల్లి లేని పిల్ల. ఎలా బతుకుతుంది? క్రూర జంతువులు చంపేస్తాయేమో అని ఆలోచించాడు. జింకపిల్లని చేరదీశాడు. నేను లేకపోతే ఈ లేడిపిల్లకి దిక్కెవరు అన్న అహంకార మమకారాలతో బుద్ధి విషయాసక్తమైంది. కర్మబంధంలో తగుల్కొన్నాడు. నేను కర్తను కాదు. కర్తృత్వం నాది కాదు. కర్మఫలం కూడా నాది కాదు అని దేహేంద్రియ మనోబుద్దుల్ని జయించిన స్థితియే నైష్కర్మ్య సిద్ధి. ఇపుడు పరబ్రహ్మ ప్రాప్తికి జ్ఞాన నిషా క్రమాన్ని తెలుపుతున్నాడు ఈ కింది శ్లోకంలో.


అర్జునా! కర్మ సిద్ధిని పొందినవాడు ఏవిధంగా పరబ్రహ్మ (పరమాత్మ)ను చేరగలడో జ్ఞాన పరాకాష్ఠ ఏదో క్లుప్తంగా చెబుతా విను. - ఇక్కడ సిద్ది అంటే ధ్యానసిద్ధి అన్నారు. కొందరు. జ్ఞానపరాకాష్టకు బదులుగా ధ్యానపరాకాష్ఠ పొందతగిందని కొందరి వ్యాఖ్య. నిష్కామ కర్మానుష్టానం వల్ల పొందే చిత్తశుద్ధి రూపమైన కర్మసిద్ది అన్నారు కొందరు. ధ్యానంతో ఎందుకు చెప్పారంటే ధ్యానయోగ పరో నిత్యం అని తర్వాత శ్లోకంలో వస్తోంది కదా అలా అన్వయించారేమో అనిపిస్తోంది. సమాసేన ఏవ క్లుప్తంగా సంగ్రహంగా అని అర్థం. కర్మధ్యాన భక్తి జ్ఞాన యోగాల్లో కొన్ని రహస్యాలు చెప్పబడ్డాయి. అంతో ఇంతో మిగిలింది ఏదైనా ఉంటే సంక్షేపంగా చెబుతానని అర్థం. యుద్ధరంగంలో ఉన్నాడు కనుక క్లుప్తంగా చెప్పాలి. ఇది ఒకటి. గీతాసారాన్ని కుదించి చెప్పాలి. ఇది రెండోది. అందుకే తర్వాత వచ్చే మూడు శ్లోకాలు అతి ప్రధానమైనవిగా గుర్తుంచుకోవాలి. పరబ్రహ్మను పొందే విధానాన్ని ధ్యాన యోగానంతరం పరబ్రహ్మను పొందటంలో ఆచరించాల్సిన అనుష్టాన విశేషాల్ని వరుసగా మూడు శ్లోకాల్లో వివరిస్తున్నాడు భగవానుడు. -


వినిర్మలమైన బుద్ధి కలవాడు శబ్దాది విషయాలను పట్టుదలతో త్యజించినవాడు యోగానికి తగిన స్థితిలో మనస్సుని నిగ్రహించినవాడు రాగద్వేషాలను పరిత్యజించినవాడు...


ఏకాంత ప్రదేశంలో నివసించేవాడు, మితాహారి, మనస్సు వాక్కు శరీరాన్ని అదుపులో పెట్టుకున్నవాడు, నిరంతర ధ్యాన యోగ తత్పరుడైనవాడు, ఇహ పర సుఖ భోగాలపై వైరాగ్యం అవలంబించినవాడు...


అహంకారం బలం దర్పం కామం క్రోధం జీవితావసరమైనవి తప్ప తక్కిన భోగ విషయాలను గ్రహించకుండా విడిచిపెట్టినవాడు, దేహం మీద, జీవితం మీద మమకారం లేనివాడు, శాంతచిత్తుడు ఇత్యాది సాధనలతో బ్రహ్మత్వం (మోక్షం) పొందటానికి సమర్థుడవుతున్నాడు. బుద్ది శుద్ధంగా కాదు విశుద్ధంగా ఉండాలి. అంటే అత్యంత నిర్మలమై ఉండాలి. రజోగుణ తమోగుణ స్పర్శ ఏమాత్రం సోకకుండా సంపూర్ణ సాత్వికమై ఉండాలి. ఏ దురాలోచనలకు, పాప సంస్కారాలకు లేశమాత్రం మనస్సులో చోటు ఉండనీయరాదు. బుద్ధి సాత్వికమైతే ధృతి కూడా సాత్వికం కావాలి గదా. మొక్కవోని పట్టుదలను ధృతి అని చెప్పొచ్చు. ఈ అధ్యాయం 33 శ్లోకంలో ధృతికి ఉదాహరణగా ధ్రువుని ధైర్యాన్ని, పట్టుదలని ఉదాహరణగా చెప్పుకున్నాం గమనించండి. మనస్సు పాపిష్టిది. నమ్మరాని చుట్టం. చాలా బలం కలది.


చంచలమైంది. శరీరాన్ని ఇంద్రియాల్ని బాగా క్షోభింపచేస్తుంది. విషయ వాసనల నుంచి మనస్సుని మరలించటం చాలా కష్టం. మనస్సుని నిగ్రహించటం అంటే ఆకాశంలో గాలిని నిరోధించినట్లే. చాలా దుష్కరమైంది మనస్సు అంటాడు అర్జునుడు. అభ్యాస వైరాగ్యాలతో మెల్లగా మెల్లగా క్రమ క్రమంగా వశపరచుకోవాలని కృష్ణభగవానుని జవాబు. కనుక మనస్సుని నిగ్రహించటానికి లొంగదీసుకోవటానికి దృఢమైన ధైర్యం పట్టుదల కావాలి. విషయ వాసనల నుంచి సాంసారిక విషయ భోగాల నుంచి సాత్విక ధృతితో మనో బుద్దీంద్రియాలను నిగ్రహించాలి.


ఇంద్రియస్యేంద్రియస్యార్డే రాగద్వేషా వ్యవస్థితౌ (3-34). ప్రతి ఇంద్రియానికి దాని దాని శబ్దాది విషయాల్లో రాగద్వేషాలు కలి ఉంటాయి. అనుకూల విషయాల్లో రాగం ప్రతికూల విషయాల్లో ద్వేషం ఏర్పడుతూ ఉంటాయి. వాటికి వశపడరాదని చెప్పబడింది. శత్రువులు బయట ఎక్కడో లేరు. లోపల ఉన్నారు. అంతశ్శత్రువులైన రాగద్వేషాలను హృదయ క్షేత్రంలోంచి తరిమి వేయాలి. ఎలా అంటే ధ్యాన యోగ సాధనతో ఆ శత్రువులు లోపలికి ప్రవేశించకుండా ధైర్యంతో మొండి పట్టుదలతో అడ్డుకోవాలి. బయటికి తొందూ డకుండా మనోబుద్దుల్ని అంతర్ముఖం చేసి ఆత్మధ్యాన నిమగ్నులమవ్వాలి. ఆ ధ్యానం ఎలా ఉండాలంటే ధ్యానయోగి కాని, జ్ఞానయోగి కాని, సాధారణ సాధకుడు కాని ప్రారంభంలో వివిక్తసేవీ ఏకాంతవాసిగా ఉండాలి. నిర్జన ప్రదేశంలో సాధన చేయాలి. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎవ్వరూ లేని చోట సాధన చేస్తాం. బాగా నేర్చుకున్న తర్వాత రద్దీగా ఉండే బజార్లలో కూడా తొక్కగలం. అలాగే మొదట ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేయాలి. పదిమంది తిరిగేచోట చేస్తే ఏకాగ్రత కుదరదు. అనుభవం సంపాదించాక పదిమందిలో ధ్యానం చేసినా సమాధి స్థితికి అంతరాయం కలుగదు. అందరిలో కూర్చున్నా తలచిన వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు రామకృష్ణ పరమహంస. లఘ్వాశీ - ధ్యాన జ్ఞాన యోగులు మితాహారులుగా ఉండాలి. శుద్ద సాత్విక ఆహారం శరీర పోషణకి చాలినంత మితంగా తీసుకోవాలి. ఆకలికి తగినంత తినటం యోగి లక్షణం. రుచికి తినటం భోగి లక్షణం. యుక్తాహార విహారస్యా అని 6-17లో వచ్చింది. 17వ అధ్యాయంలో సాత్విక ఆహారం ఏమిటో వివరింపబడింది. అక్కరూ డగలరు.


అన్నం ఆకులో తినడడ్రే ష్ఠం. ఆర్థిక స్తోమత ఉన్నవారు వెండి బంగారు కంచాలలో తింటారు. ఇపుడు అందరి ఇళ్ళల్లో తళతళ మెరిసే స్టెయిన్లెస్ స్టీల్ కంచాలున్నాయి. ఇనుప కంచాలు మంచివి కావు. వాటిని ఉపయోగించటం వల్ల ఆలోచనల్లో ఇనుప గజ్జెల తల్లి తాండవిస్తూ ఉంటుంది.


యతవాక్కాయ మానసః - మాట మితంగా ఉండాలి. ప్రియభాషణం, మితభాషణం, హితభాషణం అలవరచుకోవాలి. అలాగే దేహేంద్రియ మనోబుద్ధులను అదుపు చేయాలి. వాటిని ధ్యానానికి అనుకూలంగా మలచుకోవాలి. నిత్యం ధ్యాన నిమగ్నుడై ఉండాలి. భగవత్ తత్వం ఆత్మ విచారణ తప్ప తక్కినవాటిపై మనసుని పారాడనివ్వకుండా ఉండాలి. అంటే తక్కిన వాటిలోని దోషాలను గమనించి విరక్తి భావన అలవరచుకోవాలి. మరణ పర్యంత వైరాగ్యాన్ని ఆశ్రయించాలి. ఉపాశ్రితః అనకుండా సముపాశ్రితః అనడంలో ఉద్దేశం అదే. ఆ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం కారాదు. త్రికరణశుద్ధిగా పరిపూర్ణమైన అసలు సిసలైన వైరాగ్యం బతికినంతకాలం పాటించాలి.


అహంకారం బలం దర్పం క్రోధం ఇవన్నీ ఇంతకు ముందు చాలాసార్లు వచ్చాయి. అవన్నీ అసుర సంపత్తికి చెందినవి. పునరుక్తి దోషం కాదని చెప్పుకున్నాం. విద్యార్థులకు విషయం బాగా అర్థం కావాలని ఉపాధ్యాయుడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతాడు కదా. అలా ఆధ్యాత్మిక రంగంలో పునరుక్తి దోషం కాదు.


అహంకారం అనేక రకాలు. ధన అహంకారం, విద్యా అహంకారం, కుల అహంకారం, బల అహంకారం, యవ్వన అహంకారం, అధికార అహంకారం, రూప అహంకారం. ఇవి కాక ఇంకా కొన్ని ఉన్నాయి. నేనుకర్తను.నేనే చేస్తున్నా, అన్నీ నాకు తెలుసు. నేను జ్ఞానిని, నేను భక్తుడిని ఇలా పలు పోకడలున్నాయి. బలం - పరులంటే ఏమాత్రం దయా దాక్షిణ్యాల్లేకుండా వాళ్ళని అణగదొక్కే పశుబలం కావచ్చు. తన వెనుక ఉన్న ధన జన బలంతో కండకావరంతో ఎవ్వరినీ ఖాతరు చేయని లక్షణాన్ని దర్పం అని చెప్పొచ్చు. మనసులో పుట్టిన ప్రతి కోరిక తీర్చుకోవాలనేది కామం అయితే, ఆ తీర్చుకోవడం ఏదైనా అడ్డుతగిలితే ఆ ప్రతిబంధకాన్ని ఎదుర్కోవడమే క్రోధం అనిపించుకుంటుంది. శరీర పోషణకు నిత్యావసరాలకు తగినంతవస్తుసామగ్రిని ఉంచుకోవాలి. అధికంగా దాచినదంతా పరిగ్రహం కింద లెక్క. తీసుకోవడం కన్నా ఇవ్వడం మిన్న. ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది. తీసుకునేవాడి చేయి కింద ఉంటుంది.


అహంకారం బలం దర్పం ఇత్యాదులన్నీ విముచ్య అంటే పరిత్యజించి నిరంతర ధ్యాన యోగ తత్పరుడై ఉండాలి. మమతాహంకార రహితుడై ఉండాలి. శాంతచిత్తుడై ఉండాలి. అలాంటివాడు ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, స్త్రీ కాని, పురుషుడు కాని గౌరవనీయుడు. అలాంటివాడు శాశ్వతం సత్యం నిత్యమైన మహాచైతన్యంతో సమానం. బ్రహ్మ భూయాయ కల్పతే. ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యుడు. లేదా పరమాత్మ (పరబ్రహ్మ) సాక్షాత్కారానికి అర్హుడు. పరబ్రహ్మంలో లేదా పరమాత్మలో లీనమయ్యే స్థాయికి ఎదిగిపోతాడని మరోరకంగా చెప్పొచ్చు. ,


సకల ప్రాణి కోటిని తన ఆత్మలో ఎవడైతే దర్శిస్తాడో ఆ జీవకోటిలోని ఆత్మ తనకన్నా వేరు కాదని ఎవడైతే భావిస్తాడో (అంతటా ఒక చైతన్యంగా సాక్షాత్కరిస్తూ ఉంటే) ఎవ్వరినీ వాడు ద్వేషించడు అంటుంది. ఈశావాస్యం ఆరో మంత్రం. అదే బ్రహ్మ భూయాయ కల్పతే నిర్గుణ నిరాకార సగుణ సాకార పరమాత్మ. అనుభవానికి యోగ్యత, అర్హత. ఆ జ్ఞాన ప్రభావంతో సర్వప్రాణులను నీలో సంపూర్ణంగచూ డగలవు. తర్వాత పరమాత్ముడనైన నాడూ డగలవు (4-35).


నిష్కామ కర్మాచరణతో జ్ఞాన నిష్ఠని సంపాదించి ఆత్మానుభవంలో నిమగ్నుడైనవాడు దేనికీ శోకింపడు. దేనినీ కోరడు. సర్వ ప్రాణులను సమభావంలో సే ఆ యోగి నా పరాభక్తిని పొందుతాడు. ఏదైతే తెల్సుకుంటావో ఇక నీకు తెల్పుకోదగ్గది ఏమీ ఉండదన్న దానికి ఈ పరాభక్తిని ఉదహరించవచ్చు. కర్మ జ్ఞాన భక్తి యోగాలకు సమన్వయం కల్పిస్తోంది ఈ శ్లోకం. బ్రహ్మ స్వరూపానికి సమరుడైనవాడు, నిర్మలమైన మనస్సు కలవాడవుతాడు. నా మనసంతా నీవే అన్నాడొక కవి. మనస్సు నిండా పరమాత్మ ఉంటే ఇంక కోరికలెక్కడి నుంచి వస్తాయి? శోకం ఎక్కడిది? మనసు మలినపూరితమైతే భగవంతుడు రాగలడా? ఒకడు నాకేదైనా ఉపదేశించు అని భిక్షకు వెళ్ళిన బుద్దుని అడిగేవాడు. ఒకనాడు మలినమైన భిక్షాపాత్ర పట్టుకెళ్ళాడు బుద్ధుడు. ఆ పాత్ర శుభ్రంగా లేదు, ఎలా భిక్ష వేయాలన్నాడు ఆ గృహస్తు. నీమనస్సు కూడా ఇన్ని మలినాలతో దుష్ట సంకల్పాలతో నిండి ఉంటే నేనెలా ఉపదేశం చేయాలని బుద్ధభగవానుని జవాబు. .


తత్వజ్ఞానంలో పరాకాష్ఠను పొందినవాడే జ్ఞాన నిష్ఠుడు. బ్రహ్మ భూతుడు. బ్రహ్మ (ఆత్మ) సాక్షాత్కారం పొందాక ధ్యాన నిష్టలోంచి మామూలు స్థితిలోకి వస్తాడు యోగి. సముద్ర మధ్యభాగం ఎలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంటాడు. ధ్యానంలో ఏ పరమాత్మను దర్శించాడో ధ్యానానంతరం ఈ లోకంలోని సకల ప్రాణికోటిలో ఆ పరమాత్మని దర్శించేవాడై ఉండాలి. బ్రహ్మ భూతః అన్న శబ్దానికి అదే అర్థం. భౌతిక జగత్తులో కర్మాచరణలో దుఃఖం ఉంటుంది.


కోర్కెలుంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో (భావనలో) శుద్ధభక్తి యుతుడైనవానికి దుఃఖం ఉండదు. కోర్కెలుండవు. వెన్న ఎక్కువ తిన్నాడు, అజీర్ణంతో ఎక్కడ బాధపడతాడో అని కలవరపడిపోయేది యశోదమ్మ. ఎవరైనా ఏ కీడు తలపెడతారోనని ఎన్నిరకాల దిష్టి తీస్తూ ఉంటుందో బాధపడతాడో అని కలవరపడిపోయేది యశోదమ్మ. ఎవరైనా ఏ కీడు తలపెడతారోనని ఆ తల్లి. సేవలో కష్టం ఉండదు. దుఃఖం ఉండదు. మనసులో సేవాభావం తప్ప మరే కోరికలుండవు. ఇది సాధారణ సాధకుని స్థితి. ఇక యోగి స్థితి - నీ నా తర తమ భేదం ఉండదు. పేద ధనికుడని కాని, స్త్రీ పురుషుడని కాని తేడా కనిపించదుఅందరిలో పరమాత్మని దర్శిస్తూ ఉంటాడువాని చేతికి రాయినిచ్చినా, బంగారాన్నిచ్చినా సమభావంలో స్తాడు. బ్రహ్మ భూతస్థితి ఆ యోగి కల్గి ఉంటాడు. అతడు కర్మయోగి కావచ్చు. జ్ఞానయోగి కావచ్చు. ధ్యానయోగి కావచ్చు. భక్తియోగి కావచ్చు. బ్రహ్మ భూత స్థితిని అహం బ్రహ్మాస్మిగా వ్యాఖ్యానించారు కొందరు. అదొక అనుభూతి మాత్రమే. అదొక భావాతీత స్థితి మాత్రమే.


మద్భక్తిం లభతే పరాం - నా సంబంధమైన పరభక్తిని పొందుతాడు. భక్తి మూడు రకాలన్నారు పెద్దలు. శ్రవణం అర్చనం సంకీర్తనం ఇత్యాదులతో భగవత్ మకు పాత్రులవడం. దీనిని వైదీభక్తి అంటారు. దాస్యం సఖ్యం ఆత్మనివేదనంతో భగవత్ అనుభూతిలో నిమగ్నం కావడం దీనిని అనురాగభక్తి అంటారు. కర్మ భక్తి జ్ఞానాలతో పరమాత్మ అనుభవంలో మునిగిపోయి ప్రపంచాన్ని మరచిపోవడం. దీనిని పరాభక్తి అంటారుఇది ప్రహ్లాదుని భక్తితో పోల్చవచ్చు. , మరికొందరు ఇంకోరకంగా చెప్పారు. 1. పరభక్తి - భగవత్ దర్శన ప్రాప్తికై తపించేస్థితి. 2. పరజ్ఞానం - భగవత్ సన్నిధికై తపన. ఇది పరభక్తి లోని విశేష జ్ఞానం. 3పరమభక్తి - భగవత్ ఐక్యంలో క్షణకాలం కూడా ఎడబాటు సహించలేని భక్తి పండిన మదశ. ఇది గోపికల భక్తితో పోల్చవచ్చు.


అది యమునాతీరం. వెన్నెల రేయి. ఇసుక తిన్నెలు. కృష్ణుని మురళీగానం వినపడింది. ఇంట్లో పెద్దల్ని లెక్కచేయక పరుగులు తీశారు గోపికలు. అత్త మామ భర్త అడ్డుకున్నారు. ఒక గోపికని. బలవంతాన లాక్కెళ్ళి స్తంభానికి కట్టి గది తలుపులు వేశారు. ఆ స్వామిని చేరలేకపోయానని ఏడ్చింది. ఏడుస్తున్న కొద్దీ కనులు తెరిచినా మూసినా మనసులో నల్లనివాడు, పద్మనయనంబులవాడు, నెమలిపింఛం వాడు దర్శనమిస్తున్నట్లుగా ఉంది. కృష్ణ సన్నిధానానికి పరుగులు తీసింది మనసు. తన అంతరంగ క్షేత్రంలో కృష్ణునితో కలిసి ఆడింది. పాడింది. తెల్లవారింది..... అలసి సొలసి పోయింది. తెల్లవారింది. కోడలితో గొడ్డుచాకిరీ చేయించుకోవాలని గది తలుపులు తెరిచింది అత్త. కట్టిన కట్లను ఊడదీసింది. అంతే హఠాత్తుగా నేలమీద పడిపోయిందా గోపిక. కృష్ణభగవానుని చింతిస్తూ తన మనసులో ఆ గోపిక ఆడి పాడి ఎప్పుడు తనువు చాలించి స్వామిలో ఐక్యమై పోయిందో తెలియదు. అనన్య భక్తితో పరమాత్మ ఎడబాటును సహించలేక చింతిస్తూ ఉండిపోయింది కనుక ఆ గోపికకు చింతయంతి అని పేరు పెట్టారు మన పెద్దలు. ఇది పరమ భక్తికి ఉదాహరణ. మద్భక్తిం లభతే పరాం అన్న దానిలోనే పరభక్తి ఈ పరమ భక్తి రెండూ ఒకటే. తేడా లేదని గమనించాలి. మత్ కర్మ కృత్ - పదకొండో అధ్యాయం చివరి శ్లోకం ఇక్కడ అనుసంధానం చేస్తే సమంజసంగా ఉంటుంది.  అలాంటి భక్తి వల్ల కల్గే ఫలం చెబుతున్నాడిపుడు.


                                                                                                       (సశేషం)