ధ్యానంతో కృతయుగం, పుణ్యక్రతువులతోత్రే తాయుగం, అర్చనలతో ద్వాపరయుగం పూర్తి అయినాయి. కలియుగం ఆరంభమైంది. కలిపురుషుని ప్రభావంతో జనజీవన విధానం అధర్మం, అన్యాయం, అరాచకత్వాలకు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు నిలయమై, ప్రశాంతత లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా పర మతాలు తమదైన శైలిలో వైదికాచారాలకు, వైదిక ధర్మాలకు భిన్నమైన సంస్కృతిని ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ స్థితిని గమనించిన పరమాత్మ గతంలో తెరదీసిన అవతారాలకు భిన్నంగా అర్చామూర్తియై స్వయంభువుగా ఆవిర్భవించి, జనజీవన కళ్యాణానికి శ్రీ కారం చుట్టాలని భావించి, 108 దివ్యక్షేత్రాలలో తాను అర్చామూర్తియై నిలిచాడు. అలాగే తన పరివారమైన విష్వక్సేనుడు, శంఖం, చక్రం, గద, భూమాత, గరుడుడు, శ్రీ వత్సం, కౌస్తుభం మొదలైనవారి అంశలతో ఆళ్వారుల ఆవిర్భావానికి పథక రచన చేశాడు. అలా భువిపైకి వచ్చినవారే ఆళ్వారులు.వైష్ణవ భక్తశిఖామణులు.లీలాయోగులు. సుజ్ఞానఖనులు. దివ్యమునులు. అంతర్యామియైన అక్షర పరబ్రహ్మను సదా యోగంతో, ధ్యానంతో దర్శించి, ఆనందానుభూతిని పొందిన మోక్షసాధకులు. ఆళ్వారులు అనగా లోతుకు పోయినవారు, లోతును ఎరిగినవారని అర్థం. పరమాత్మ తత్త్వానుభూతి యొక్క లోతును తెలిసినవారు ఆళ్వారులు. భక్తికి నిజమైన నిలువెత్తు సాక్ష్యం ఆళ్వారులు. అపారజ్ఞానం, ముగ్ధభక్తి, విశుద్ధ వర్తనం వీరి సొత్తు. భగవత్ తత్త్వావగాహనం, ఆరాధనం, అనుబంధం కల్గి అర్చామూర్తియైన అచ్యుతుని ద్రవిడ భాషలో గానం చేశారు. వీరు పడై ండు మంది. వీరందరూ పరమాత్మను తమిళ పాశురాలలో గానం చేశారు. వీరి రచనల కూర్పే నాలాయిరం అనే దివ్య ప్రబంధం. ద్రవిడ వేదంగా ప్రఖ్యాతిని పొందింది. ఆళ్వారుల పాశుర గానంతో, ధ్యానంతో, ద్రవిడ భాషకు ప్రఖ్యాతి ఏర్పడింది. వీరే పన్నిద్దరాళ్వార్లు. వీరిలో ఏకైక మహిళా ఆళ్వారు ఆండాళ్ తల్లి. ఆమెయే గోదాదేవి. ధర్మానికి ప్రతిరూపమైన ధనుర్మాసంలో "తిరుప్పావై' వ్రతం ఆచరించి, పరమాత్మనే పతిగ పొందిన సుకృతి ఆండాళ్ ఆళ్వారు. అలాగే ఆండాళ్ తల్లి పెరియాళ్వార్, నమ్మాళ్వార్, తిరుప్పాణ్ ఆళ్వార్, విప్రనారాయణ ఆళ్వార్ వగైరాలు. "స్వామీ! అవతారాలు చాలించి, అర్చామూర్తివై మాకు సేవ చేసుకునే భాగ్యాన్నిచ్చావా తండ్రీ" అన్న తిరుమంగై ఆళ్వార్ మాటలు అక్షర సత్యాలు. అవతారాలకు క్షీరాబ్ది శయనుడైన శ్రీ మహావిష్ణువు మూలం. అలాగే అర్చారూపాలకు శ్రీ రంగనాథస్వామి మూలం. ఆళ్వారులందరూ ఉభయ కావేరుల మధ్య ఉన్న శ్రీ రంగనాథస్వామిని గానం చేసినవారే. 108 దివ్యక్షేత్రాలు 108 దివ్య తిరుపతులు కాగాశ్రీ రంగం, తిరుమల, కంచి మొదలైన వైష్ణవ దివ్యక్షేత్రాలు ప్రధానమైనవి.
ఆళ్వారులు విభిన్న కులాలవారు. విశిష్టమైన వర్గాలవారు. బడుగులకు, బలహీనవర్గాలకు, బాధితులకు, బాధలలో ఉన్నవారికిని వీరు అండ. "ఆత్మవత్ సర్వభూతాని, సర్వభూతానిచ ఆత్మని" అన్న గీతావాక్యానికి నిదర్శనం. బ్రహ్మజ్ఞాని, అజ్ఞాని, మూర్ఖుడు, ఆవు, కుక్క, ఏనుగు, చండాలుడు అన్న భేదం లేని సమదృష్టి గలవారు. అందరిలోను ఒకే ఆత్మ ఉందన్న నిజాన్ని అనుభూతితో తెలుసుకొన్నవారు. అందరినీ ఒకేవిధంగా ఆదరించేవారు. బాధలకు క్రుంగిపోవడం, బోధనలకు పొంగిపోవడం ఉండదు. మానావమానాలలో ఒకే రీతిలో ఒకే నీతితో ఉండే భాగవతులు ఆళ్వారులు. అలాగే ఆత్మ - పరమాత్మ ఒక్కటే. సనాతనం, నిత్యం, సత్యమైన ఒకే తత్త్వం ఆత్మ పరమాత్మలది. పరమాత్మ సదా ఆత్మతోనే ఉంటాడు. ఆత్మలోనే ఉంటాడు. "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి చూ చిన అందందే గలడు" అన్న ప్రహ్లాదుని మతం ఆళ్వారులది.
అంతేకాదు నీళ్ళు త్రాగుతున్నను, ఆహారం తింటున్నను, మాటాడుతున్నను, హాస నిద్రాదులందును నిరంతరం పరమాత్మ పదపద్మారాధనలో మునిగి తేలుతుంటారు. ఆ భక్తి పారవశ్యంలో వారు పొందే ఆనందానుభూతి అనిర్వచనీయం. అనితర సాధ్యం. ఐహికాలు పట్టని పారలౌకికమైన పరమానందానుభూతి అది. అదే గీతలో శ్రీ కృష్ణపరమాత్మ -
అంటాడు. పరమాత్మ యందే బుద్ధి, మనస్సు, నిష్ఠ గలవారును, పరమాత్మయే జీవుడైన తనకు పరమగతిగ తలచువారును, జ్ఞానంతో తమపాపాలను శిథిలం చేసుకొన్నవారై పునర్జన్మ రహితమైన శాశ్వతమైన మోక్షాన్ని పొందుతున్నవారు. అలాంటి విశుద్ధమైన చరిత గలవారు ఆళ్వారులు. ముప్పయి రోజులు ముప్పయి పాశురాలశ్రీ రంగనాథునిపై గానం చేసి, సర్వాన్ని స్వామికి అర్పించి గోదామాశ్రీ రంగనాథుని చేపట్టి ఆయనలో కలిసిపోయింది. కథ చరిత్రలోను, పాశురాలు భాగవతులలను భక్తి చైతన్య స్ఫూర్తి నింపుతూ మిగిలిపోయాయి. పెరియాళ్వార్ నిత్యం మాలలను అర్పించి, అర్చనలు చేసి ఆత్మీయమైన పరమాత్మకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మామయై కాలం కడదాకా ఉండే కథలలో మిగిలిపోయాడు. ఈయనే గరుడాళ్వార్ అంశ అంటారు. "సేవకునిగ, మిత్రునిగ, విసనకర్రగ, చాందినీగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అమరిన గరుడుడు చివరకు తులసీవనంలో దొరికిన బిడ్డను పెంచి పెద్దచేసి స్వామికిచ్చి పెండ్లి చేసి మామ కావడం ఎంత సుకృతం! నాలాయిర ప్రబంధానికి ప్రధాన భూమిక వహించినవారు నమ్మాళ్వార్లు. ద్రవిడ వేదానికి మూలకర్త. కులశేఖరాళ్వారాదులకు భక్తిరసస్ఫూర్తినిచ్చిన మహానుభావులు. అనంత ద్రవిడ వాజ్మయానికి మూలకర్త. . తిరుప్పాణ్ ఆళ్వార్ ఒక దళితునకు వరికంకిలో దొరికిన బిడ్డ. దళితునిగా పెరిగిన భాగవతుడు. కులం పేరుతో వెలివేయబడి, తన దైవానియా డలేక తహ తహలాడిపోయిన భక్తుడు. రంగనాథుని గుడి పూజారి అహంకారానికి రాళ్ళ దెబ్బలు తిని కూడా పరమాత్మ గానంతో పరవశించిపోయిన జీవాత్మ. "భక్తిరూపం దాల్చి తిరుప్పాణ్ అయిందా! లేక ముక్తిసతి విలాసంగా తిరుప్పాణ్ గా జగమున తిరుగాడిందా! ఏమైనా ప్రశాంత యుక్తమైన భక్తి శక్తికి ప్రతిరూపం తిరుప్పాణ్ గా" కీర్తించబడినాడు. చివరకు పరమాత్మే రంగంలోనికి దిగి పూజారి భుజాలపై తన భక్తుని గుడిలోనికి రప్పించుకున్నాడు. అంటరానివాడన్న వ్యక్తే ఆ భక్తమునికి వాహనుడైనాడు. మానవునకు మాధవునకు మధ్య మలినమేమి? దేవుని కంటని మైల దేవాలయానికి అంటుతుందా? ఇవేమీ పట్టని తిరుప్పాణ్ రంగనాథుని కనులారా కాంచిన ఆనందంలో పాశురగానంతో పరమాత్మలో తలక్రిందులుగా లీనమైనాడు. మానవుడే మాధవునిలో కలసిపోయాడు. ఏది తత్త్వం? ఏది నిత్యం? ఏది సర్వ జగత్ సత్యం? అందుకే తిరుప్పాణ్ ఆళ్వారును -
అని పెద్దలు కీర్తించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కవితా హృదయం తిరుప్పాణ్ ఆళ్వార్ చరిత్రమూ డగానే కరిగి కమనీయమైన "మునివాహనుడు" అనే నాటకాన్ని అందించింది. అలాగేవిప్రనారాయణుడు. ఈయనేతొండరడిప్పొడి ఆళ్వారు. స్వామి వైజయంతీమాల అంశతో జన్మించినవాడు. బాగా చదివినవాడు. అన్నీ తెలిసినవాడుశ్రీ రంగనిపైన అమితమైన, అవ్యాజమైన భక్తి ప్రపత్తులు కలవాడు. పెరియాళ్వార్ వలెనే ఉద్యానవనాన్ని స్వామికై నిర్మించి, ప్రతిరోజు పూలమాలలను అర్పించి, అర్చించి సేవించే నైజం. సదా స్వామి స్మరణ, ధ్యానమే ఆయన నియమం. మంచి వయస్సు, మధుర వచస్సు, మహిత వర్చస్సులత డ ముచ్చటగొలిపే అందం ఆయనది. కాని దేవదేవి అనే దేవదాసికి ఈయనపై కన్ను పడింది. ఆ మాయలో ఈతడుమడిని మరచాడు. స్వామి స్మరణం సన్నగిల్లింది. ధ్యానం అటకెక్కింది. వజ్రపంజర సమానమైన ఆయన శీలం నీటికన్నా పలుచనైపోయింది. స్వామి గమనించి మాయ నాటకం ఆడాడు. ఫలితంగా స్వామి గుడిలోని బంగారు పాత్ర దేవదేవి ఇంట్లో కనిపించింది. విప్రనారాయణుడే దొంగిలించి తనకు ఇష్టమైన దేవదేవికి ఇచ్చినట్లు ఆరోపింపబడింది. అందుకు రాజుగారు శిక్షను కూడా విధించారు. విప్రనారాయణుడు దారితప్పినాడే కాని దొంగ కాలేదు. ఇది నిజం. ఈ నిజాన్ని శ్రీ రంగనాథుడు రాజుగారికి స్వప్నంలో కన్పించి చెప్పడంతో శిక్ష అనుగ్రహంగా మారింది. విప్రనారాయణుడు రక్షింపబడ్డాడు. విప్రనారాయణుడు తన తప్పును తెలుసుకొన్నాడు.దేవదేవియును తన జీవనమార్గం మార్చుకుంది. తమ జీవితాలను స్వామి కైంకర్యానికే వినియోగించి ధన్యులైనారు. "మీరలీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్" అని స్వామి విప్రనారాయణునకు బ్రహ్మరథం పట్టమని చెప్పడం అద్భుతం. కారణం విప్రనారాయణుడు ప్రసన్నుడు. వైష్ణవభక్తి విశ్వాసం కలవాడని స్వామి తీర్పు. పాశుర రచన, గానాలతోనే విప్రనారాయణుడు తనను తాను పరమాత్మకు అర్పించుకొన్నాడు. సుప్రభాత సేవ - మేలుకొలుపులకు విప్రనారాయణుడే ఆద్యుడు. "కదిరవన్.... పళ్ళి యెళుందరుళాయ్" "పడకనుండి లేచి దయ చేయుము" అంటూ 12 పాశురాలను గానం చేసిన తీరు అమోఘం. "తొండరడిప్పొడి" అనగా భక్తపాదరేణువు అని అర్థం. వైష్ణవ గురువుల పాదసేవ, పాదధూళిని భక్తితో శిరమున దాల్చిన మహాభక్తుడు ఈ తొండరడిప్పొడి ఆళ్వార్.శ్రీ రంగా! నీ దర్శనంతో నా జన్మ చరితార్థమైంది. భువనమోహనమైన నిను చిన నా కన్నులు వేరు దృశ్యానిష్ఠూ డటానికి ఇష్టపడుట లేదు. నీ అద్భుతమైన సౌందర్య సంపదలో నన్ను నేను కరిగించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు"మని వేడుకొన్న తీరు విప్రనారాయణుని భక్తికి అద్దం పడుతోంది.
ఇలా పన్నిద్దరు ఆళ్వారులు పన్నిద్దరు సూరులై, ద్వాదశాదిత్యులు శ్రీ మహావిష్ణువు భక్తి సామ్రాజ్యంలో వెల్గొంది, స్వామిలో లీనమైనారు. అందుకు వారి ప్రవర్తన, వారి భక్తి రచనా స్ఫూర్తి, గాన మాధుర్యపు దీప్తియే కారణం. సమాజానికి వారు చక్కని సందేశాన్ని తమ జీవితాలతో అనుగ్రహించారు. ఐహికంలో ఉంటూ పారలౌకికంలో బ్రతికారు. పదిమందిలో ఉంటూ అంతర్యామియైన పరమాత్మను అంతరంగంలో దర్శించి ఆనందానుభూతిని పొందారు. సంసార బంధాలకు, దృశ్య ప్రపంచపు మాయలకు ఆళ్వారులు తలొగ్గలేదు. వారు నమ్మింది పరమాత్మను. అనుసరించింది వైష్ణవ భక్తినీతిని. అనుభవించింది పరమాత్మను గానం చేయడంలో గల అమృత మాధుర్యాన్ని. ఫలితం జీవన్ముక్తి. పునర్జన్మ రహితమైన మోక్షం. "న జాతిః కారణం లోకే, గుణాః కళ్యాణ హేతవః" కులం, జాతి అనేవి కూడనివి. కళ్యాణ కారకం అనగా విశ్చ యోదాయకమైన గుణాలే ప్రధానమనిన రామానుజుల వారిని అనుసరిద్దాం. నారాయణ మంత్ర జపంతో, కేశవనామసంకీర్తనా గానంతో కలికల్మషాలను శిథిలం కావించుకొని, జన్మలను తరింప చేసుకొందాం. తీవ్రమైన భక్తిదీప్తి తేజరిల్లిన తావులో ప్రభవించిన చిన్నారి శ్రీ హరిమూర్తులు ఆళ్వారులు. కోప తాపాలకు, పాప శాపాలకు తల్లడిల్లే లోకంలో ఆ దురాగత దుఃఖాలను అంతమొందించడానికి వచ్చిన విష్ణు తేజోరూపాలు ఆళ్వారులు. వారి రచనలు, వారి పాటలను పరిశీలించి, ప్రమోదంతో అనుసరించడం సామాన్యులమైన మన కర్తవ్యం. సర్వసంగ త్యాగులే అయినా సర్వేశ్వరుని భక్తి భోగాన్ని ఎరిగిన యోగులు ఆళ్వారులకు అంజలిద్దాం.