పాపమోచని ఏకాదశి


పూర్వకాలంలో కుబేరునికి చైత్ర రథమనే పేరుగల ఒక వనం ఉండేది. ఆ వనంలో గంధర్వ కన్యలు కిన్నరులతో విహరించేవాడు. అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువు నిలయంగా ఉండేది. ఆ వనంలో రక రకాలైన పుష్పాలు పుష్పించి మనోహరంగా కనిపిస్తూ ఉండేవి. ఋషీశ్వరులు తపస్సు చేస్తూ ఉండేవారు. ఇంద్రుడు కూడా స్వయంగా చైత్ర, వైశాఖ మాసాల్లో దేవతా సమూహంతో కలిసి ఈ వనంలోకి విచ్చేసి క్రీడిస్తూ ఉండేవారు. ఆ వనం ఇంద్రునికి క్రీడాస్థలంగా ఉండేది. అక్కడికి దగ్గరలో మేధావి అనే పేరుగల ఒక ఋషీశ్వరుడు తపస్సులో లీనమై ఉన్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఒకసారి మంజుఘోష అనే పేరుగల ఒక అప్సరస ఈ మేధావి ఋషిని మోహితుణ్ణి చేయడానికి ఆ వనంలో సంచరిస్తూ ఉండేది. ఆమె ఆ ఋషికి భయపడి అతని సమీపానికి వెళ్ళకుండా దూరంగా ఒకచోట కూర్చుని వీణావాద్యం వాయిస్తూ మధురమైన కంఠంతో చక్కనిపాట పాడడం మొదలుపెట్టింది. అప్పుడే శివునికి శత్రువైన కామదేవుడు కూడా ఈ మేధావి ఋషిని గెలవటానికి ప్రయత్నిస్తున్నాడు. కామదేవుడు ఆ సుందరమైన అప్సరస భృకుటిని ధనుస్సుగా చేసుకుని ఆమె కంటి చూపుల దారాన్ని ధనుస్సుకు కట్టి నేత్రాలనే ధనుస్సును నారిగా చేసి, ఆమె కుచాలను బాణంగా మలచుకొని ఆ మంజుఘోషను సేనాపతిగా తీసుకొన్నాడు. కామదేవుడు ఇంకా కొంతమంది అప్సరసలను వెంట పెట్టుకొని తన మనోహరమైన సంతానం మొదలైన ఐదు బాణాలను అమ్ముల పొదిలో పెట్టుకొన్నాడు. వీటి సహకారంతో అప్పర్స మంజుఘోష ముని మనస్సుని హరించింది.


ఋషీశ్వరుడు శంకరుని ధ్యానం మరచిపోయాడు. మంచి యవ్వనంలో, పుష్టిగా ఉన్నాడు. అంతేగాక అతడు యజ్ఞోపవీతం, దండం ధరించి ఉన్నాడు. బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతుండగాసుందరమైన ఆ ఋషీశ్వరుణ్ణి చూసిన మంజుఘోష అతని సౌందర్యానికి ముగ్ధురాలైంది. ఆమె తన గీతానికి అనుకూలంగా తన గాజులను, మూపురాలను ఝంకారం చేస్తూ నృత్య కళతో హావభావాలను అభినయిస్తూ ఆ మునీశ్వరుణ్ణి సంతోష పెట్టసాగింది. చాలా సేపటివరకు ఈ క్రమం నడుస్తూ ఉంది. చిట్టచివర కామదేవుడు తన బాణాలతో ఋషీశ్వరుణ్ణి ఓడించాడు. తత్ఫలితంగా ఋషీశ్వరుడు మంజుఘోష వెంటబడి తిరగడం ప్రారంభించాడు. ఆయన మన్మథునికి వశీభూతుడై కామునికి దాసుడై తన సమస్త తపస్సును, త్యాగాన్ని, వైరాగ్యభావాన్ని పూర్తిగా మరచిపోయాడు. ఇంకేముంది ఆయనకు రాత్రి, పగలు అనే జ్ఞానం లేకుండా పోయింది. అంతేకాదు ఈవిధంగా చాలా సమయం గడిచిపోయింది. ఒకరోజున అప్సరస మంజుఘోష ఋషీశ్వరునితో “మీవెంట ఉండి, నాకు చాలా కాలం గడిచిపోయింది. ఇప్పుడు నేను స్వర్గలోకానికి వెళ్ళాలి. అందుకు తమరు ఆజ్ఞను ఇవ్వండి” అన్నది. అప్పుడు మునీశ్వరుడు “ఇప్పుడా! కొద్ది సేపట్లో రాత్రి కానున్నది కదా! రేపు ఉదయమే వెళుదువు. ఇంకొంత కాలం ఆగు” అన్నాడు.


అప్సర మరికొంత కాలం ఉండిపోయింది. చివరకు మునీశ్వరునితో తిరిగి తాను వెళ్ళిపోవడానికి అనుమతినిమ్మని కోరింది. “ఇప్పుడు మధ్యరాత్రి మాత్రమే అయింది” అన్నాడు ముని. “నేను ఇక్కడికి వచ్చి ఒక్క మధ్యరాత్రే కాదు. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి” చెప్పింది అప్సరస. అప్సరస మాటలు విన్న మునీశ్వరునికి సమయం గురించి తెలిసింది. అప్పుడు వెంటనే అతనిలో ఆలోచన కొనసాగింది. అబ్బా! అప్సరసతో రమిస్తూ ఇప్పటికి 57 సంవత్సరముల 9 నెలల 3 రోజులు గడిచిపోయాయి అని గుర్తుకు రాగానే ఆ మేధావి ఋషీశ్వరుని ముందు ఈ అప్సరస కాలపురుషునిలా కనిపించసాగింది. నేను వంచింపబడ్డాను అని వంచితుడైన ముని స్థాణువులా నిలబడిపోయాడు. తీవ్ర కోపం కట్టలు తెంచుకుని అతడిలో ప్రవాహవేగం ప్రారంభమైంది. అతని కళ్ళనుండి చింతనిప్పుల్లాంటి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఇంతకాలం కఠినంగా శ్రమించిన నా తపస్సంతా బూడిదపాలైంది. “నా తపస్సును బూడిదపాలు చేసిన దానివి నీవే. మహాపాపివి. దురాచారిణివి. ఎంతటి మోసగత్తెవు. నన్ను మాయలో ముంచి అథోగతిపాలు చేశావు. నీవు ఎంతటి పాపానికి ఒడిగట్టావు? నా శాపం కారణంగా నీవు పిశాచానివి అవుదువు గాక!” అని ఋషీశ్వరుడు శపించాడు. ఆ శాప వాక్కులు విన్న మంజుఘోష తక్షణమే పిశాచిగా మారిపోయింది. ఆమె భయభీతురాలై గజగజ వణికిపోతూ ఆ మునీశ్వరుని కాళ్ళపై పడి ప్రార్ధించసాగింది. "ఓ మునీశ్వరా! తెలియక చేసిన పాపానికి, నీ ఆకర్షణకు లోనై నేను చేసిన ఈ తప్పుకు మీరు శపించడం సమంజసమే కాని, ఈ శాపం నివారింపబడటానికి ఉపాయమేమిటో దయచేసి తెలుపుమ”ని వేడుకుంది.


దీనురాలై అప్సరస ప్రార్థించిన మాటలను విని, మనసు కరిగి మునీశ్వరుడు ఇలా అన్నాడు. "ఓ దుష్టురాలా! నీవు నాకు మహా అపకారం చేశావు. అయినా నేను నీకు ఇచ్చిన శాపం నుండి విముక్తి కావడానికి ఉపాయాన్ని చెబుతున్నాను. జాగ్రత్తగా విను. ఫాల్గుణమాసం బహుళ ఏకాదశికి 'పావవిమోచని' ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల నీవు పిశాచయోని నుండి విముక్తురాలవు కాగలవు. తిరిగి నీకు దివ్య శరీరం లభిస్తుంది” అని చెప్పి ఋషి తన తండ్రి చ్యవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తన కుమారుడైన మేధావిని చూచి చ్యవన మహర్షి "కుమారా! నీ సమస్త పుణ్యరాశి క్షీణించిపోయింది. నీవు చేసిన అపరాధం ఏమిటి? నీ ముఖం చూడగానే నీవు చేసిన సమస్త తపస్సు నష్టమైందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి దుర్గతి నీకు ఎందుకు కలిగింది” అని అడిగాడు. మేధావి వినయంగా తండ్రికి పాదాభివందనం చేసి, చేతులు జోడించి “తండ్రిగారూ! నేను ఒక అప్సరస మాయలో పడి ఆమె వెంట రమించి చేయరాని పాపం చేశాను. ఈ పాపం నుండి విడుదల కావడానికి సరైన ప్రాయశ్చిత్తమేమిటో దయచేసి మీరే సెలవివ్వగలరు” అని దుఃఖభారంతో చెప్పాడు. అప్పుడు చ్యవనమహర్షి "పుత్రా వచ్చే ఫాల్గుణ బహుళ పక్షం లోని 'పాప మోచని ఏకాదశి' వ్రతం ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. కనుక నీవు ఆ వ్రతం ఆచరించి, నీకు కలిగిన పాపాలన్నింటినీ నశింపచేసుకో” అని తండ్రి చెప్పిన ఆదేశం పాటించి, మేధావి పాపమోచనీ ఏకాదశి వ్రతం చక్కగా ఆచరించాడు. దానివల్ల అతని సమస్త పాపరాశి నష్టమై తిరిగి పవిత్రుడయ్యాడు. ఇక అప్సరస మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి వ్రతం ఆచరించి తత్పభావంతో పిశాచయోని నుండి విముక్తి పొంది, తిరిగి దివ్యమైన తన దేహం ధరించి స్వర్గలోకానికి చేరింది.


ఈ కథను చెప్పిన లోమశ ఋషీశ్వరుడు మాంధాతతో “ఓ రాజా! ఈ పాపమోచన ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. అంతేకాదు ఈ కథను చదివినా, విన్నా వెయ్యి గోదానాలు చేసిన ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం కనుక ఆచరిస్తే బ్రహ్మహత్యా పాతకం పోతుంది. గర్భవాతం, బాలహత్యా పాపం, సురాపానం, స్త్రీహత్యా పాతకం మొదలైన సమస్త పాపాలు నశించిపోతాయి. చివరికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ కథను చెప్పాడని పద్మపురాణం వివరిస్తుంది.