రమణమహర్షి పేరు చెబితే తిరువణామలై పేరు లేదా తిరువణామలై పేరు చెబితే రమణమహర్షి పేరు గుర్తుకు వస్తాయి. భారతదేశంలో దక్షిణాన ఉన్న అతిపెద్ద ఆలయం తిరువణామలై. పంచభూతాలలో ఏర్పడ్డ అయిదు శివలింగాలలో ఒకటైన తిరువణామలైలో అగ్నిలింగం (తేజోలింగం) ప్రసిద్ధమైనది.
తమిళనాడు లోని విల్లుపురం నుండి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ప్రాముఖ్యత అక్కడ ఉన్న కొండ వలననే ఏర్పడింది. కొండక్రింద తేజోలింగానికి సంబంధించిన అతి పెద్ద ఆలయం ఉంది. బ్రహ్మాండమైన ప్రాకారాలతో పెద్దద్వారంతో ఈ ఆలయం కొండకు ఆనుకుని ఉండటం విశేషం. వెయ్యి స్తంభాల మండపం, సింహద్వారంపైన 200 అడుగుల ఎత్తైన 11 అంతస్తుల గోపురం ఈ దేవాలయానికి, నగరానికి ఎనలేని ప్రాముఖ్యత సంతరించి పెట్టింది. ఇంకో విశేషం ఏంటంటే ఈ గాలి గోపురాలు నాలుగు దిక్కులా ఒకోటి ఉండటం. ఒక గాలి గోపురాన్ని 1560లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపచేయడం విశేషం. ఈ క్షేత్రం దివ్యజ్యోతి కలిగి ఉండటంతో అరుణాచలంగా కూడా పిలువబడుతుంది. నవంబరు - డిసెంబరు నెలల మధ్యలో వచ్చే పౌర్ణమి (కార్తీక పౌర్ణమి) నాడు అరుణాచలంలో కార్తీక దీపోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఆరోజు కొండమీద పెద్దదీపం వెలిగిస్తారు. పెద్ద కంచుగిన్నెలో దేశ దేశాల నుండి వచ్చే భక్తులు కర్పూరం, నెయ్యి దాంట్లో సమర్పిస్తారు. పెద్ద పెద్ద వత్తులు ఆ గిన్నెలో వాడుతారు. ఎంత ఎండ వచ్చినా, వర్షం వచ్చినా ఆ ముహూర్తానికి క్రింద బాణాసంచా కొండమీద దీపం వెలిగించి తీరుతారు. ఆ దీపం కొన్నిరోజుల పాటు వరుసగా వెలుగుతుంది. ఎంతో దూరానికి దాని కాంతి కనిపిస్తుంది. ఈ కార్తీకదీపోత్సవం 10 రోజులు నిర్వహిస్తారు. అందంగా అలంకరించిన రథం కూడా లాగుతారు. దేవాలయ గోపురం పూర్తిగా ఎలక్ట్రిక్ బల్బులు, చిన్న ప్రమిదలలో వెలిగించిన దీపాలతో కళ్ళు చెదిరేలా మరపురానంత గొప్పగా వెలుగుతూనే ఉంటుంది.
రమణాశ్రమం అరుణాచలానికొక వరం లాంటిది. రమణమహర్షి జీవించినకాలంలో ఎన్నో దేశాల నుండి భక్తులు ఆశ్రమం దర్శించి రమణుని చూపులతోనే అనుగ్రహం పొందారు. ఎంతోమంది భక్తులు మహర్షి దీవెనలతో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. రమణమహర్షి పూర్తికాలం అక్కడే నివసించి అక్కడే సమాధి పొందారు. దేవాలయం లోపల పాతాళలింగ సన్నిధివద్ద రమణ మహర్షులకు జ్ఞానోదయం కలిగిందట. ఆ ప్రదేశం నేడొక పవిత్రస్థలంగా రూపుదిద్దుకుంది. ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ (కొండచుట్టూ ప్రదక్షిణ) చాలా ముఖ్యమైనది. 18 కి.మీ దూరం ఉండే ఆ మార్గం నిత్యం ఎంతోమంది దర్శిస్తారు. చుట్టూ ఎన్నో పవిత్ర ప్రదేశాలు, తీర్థాలు ఉన్నాయి. అరుణాచలం నగరానికి కార్తీకపున్నమి పెద్ద పండుగ కొండమీద దీపంతో పాటు ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించి జరుపుకుంటారు. అరుణాచల నగరం కార్తీకపున్నమినాడు దీపకాంతులతో ధగధగలాడి పోతుంటుంది. గిరిప్రదక్షిణ నడిచిపోలేనివారు ఆటోలలో వెళ్ళివస్తుంటారు. ప్రదక్షిణా పథంలో 8 శివాలయాలున్నాయి. ప్రదక్షిణ చేస్తున్న భక్తులు ప్రతి ఆలయాన్ని దర్శిస్తూ మధ్య మధ్య అరుణాచల శిఖరాన్ని తలెత్తి చూసుకుంటూ నమస్కరిస్తుంటారు. 2688 అడుగులున్న కొండపైకి చేరాలంటే 8 కి.మీలు నడవాలి. అందుకు నాలుగు గంటల సమయం పడుతుంది.