భగవద్గీత


నివాచకవచుల్ని జయించి దేవతలకు విజయం సాధించి పెట్టాడు అర్జునుడు. ఇంద్రునితో గౌరవింపబడి కిరీటి అనిపించుకున్నాడు. పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించాడు. ఉత్తర గోగ్రహణంలో భీష్మాది కురువీరుల్ని జయించాడు. ఇపుడు దుర్యోధనాది శత్రుమూకల్ని తన గాండీవంతో వెలువడే దివ్యాస్త్రాలతో భస్మం చేస్తానని అహంకరించాడు. అంతలో తాతలు గురువులు ఇత్యాది బంధుమిత్రుల్ని ఎలా చంపాలనే శోక మోహాలకు గురై కూలబడ్డాడు. అర్జునునిలో అహంకారాన్ని శోకమోహాల్ని అంతం చేస్తూ అతనిలో కర్తవ్యం నూరిపోయాలని తీర్మానించాడు భగవానుడు. అది చెయ్, ఇది చెయ్ అని అన్నీ చెప్పాను. నీకేది ఇషమో అది చేసేసుకో అని వదిలేశాడు.


శ్రీ కృష్ణుడు దేవాది దేవుడు. జ్ఞాన బల వీర్య ఐశ్వర్య తేజస్సంపన్నుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. అంతకు మించి గొప్ప మానసిక శాస్త్రవేత్త. అలా ఎందరో ఎన్నో రకాల కీర్తించారు ఆ స్వామిని. అర్జునునికి కృష్ణుని సౌలభ్యంతో పాటు పరత్వం తెల్సి వచ్చింది. నిర్ణయం తనకి వదిలేసినా తీసుకోలేకపోయాడు. నేను కర్తను కాదు. భోక్తను కాదు. నేను పరతంత్రుడిని.


నాలోని అహంకార మమకారాలు పోగొట్టు అని ఏడ్చాడు. అపుడన్నాడు భగవానుడు - అర్జునా నీ భారమంతా నా తలకెత్తుకుంటున్నా. మా శుచః ఏడ్వకు. నీవు నిశ్చింతగా ఉండు. యుద్ధం చేసినా పాపం మూట కట్టుకోవు. అంతో ఇంతో ఏదైనా ఉంటే సర్వ పాపాల్ని భస్మం చేస్తానని ఓదార్చుతూ చరమ శ్లోకం ఉపదేశించాడు. యుద్ధం చేయటమా మానటమా ఏది శ్రీ యస్కరమో తెల్సుకో లేకున్నాను. శిష్యసేహం శాధిమాంత్వాం ప్రపన్నం నేను నీకు శిష్యుడిని, శరణాగతుడిని. ఉపదేశించు అని అర్జునుడు మొదట్లో ఇటశరణు వేడాడు. ఇపుడు మామేకం శరణం వ్రజ అంటున్న భగవానుని మాటలకి కట్టుబడ్డాడు. భగవదనుగ్రహ ప్రాప్తితో శరణాగతి చేశాడు. ఆ సుందరకాండలో హనుమంతుడు అంటాడు. అమ్మా సీతమ్మా నీకెందుకు బెంగ. నా భుజం మీద కూర్చో. నిన్ను రామసన్నిధికి చేరుస్తా. అందుకు సీతమ్మసమాధానం ఇది. యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్వ సదృశం భవే - రాముడు లంకకు రావాలి. దశకంఠుని సబాంధవంగా హతమార్చాలి - నన్ను తీసుకెళ్ళాలి. ఆ మహావీరుని స్థాయికి తగిందని పలుకుతుంది. అంటే నా రక్షకుడు రాముడే. ఆ రామునికే నా శరణాగతి. నేనాతనిని నమ్మినానని భావార్థం. రామాయణాన్ని దీర్ఘ శరణాగతి అని పిలుస్తారు వైష్ణవాచార్యులు. శరణాగతికి దేశకాల నియమాల్లేవని ఒకసారి చెప్పుకున్నాం. భగవానుడే ఉపాయం ఉపేయం అని విశ్వసించి శరణాగతి చేస్తే దాన్ని ప్రపత్తి అంటారు. ప్రపత్తి చేసినవారిని ప్రపన్నులంటారు. అలాంటి ప్రపన్నులకు ఆద్యులు ఆళ్వార్లు. పన్నెండు మంది ఆళ్వారులలో ఎనిమిదిమంది కడజాతి వాళ్ళు కావడం, ఆరాధనీయులు కావడం గమనించదగ్గ విషయం. శరణాగతికి జాతి మత కుల లింగభేదం లేదని గ్రహించాలి.


శరణం అనేది ఉపాయమైతే శరణ్యుడు ఉపేయం అంటే పొందతగినవాడు. అలాగే సాధనం సాధ్యం. ప్రాపకం ప్రాప్యం. శరణాగతికి ఆరు లక్షణాలు చెప్పారు మన పెద్దలు. 1. నేను భగవంతునికి అనుకూలుడను 2. ప్రతికూలుడను కాను. 3. పరమాత్మ నన్ను తప్పక రక్షించగలడని నమ్ముతున్నాను 4. ఆ భగవంతుడు సర్వ రక్షకుడని తలుస్తాను 5. నాకు చెందినవన్నీ పరమాత్మకే సమర్పించుకుంటాను. 6. నేను ఏమీ లేనివాడినని నా అకించినత్వం స్వామికి చెప్పుకుంటాను. నారాయణాయ నమః. నమః అంటే నాకు నేను కాదు. నారాయణుని కోసమే ఉన్నాను. ఆయన స్వామి. నేనాయన సొమ్ము. సర్వ జగత్ రక్షకుడు. కర్త కర్మ క్రియ సర్వమూ ఆ నారాయణుడే అన్నది సంపూర్ణ శరణాగతి. శరణాగతిచేయాలంటే ధైర్యం తెగింపు త్యాగం ఉండాలన్నాడు స్వామి వివేకానంద. ఆ లక్షణాలు రామానుజాచార్యులలో ఉన్నాయి. ఆయనశ్రీ రంగంలో ఉంటున్నాడు. అక్కడికి కొన్ని వందల కి.మీల దూరంలో తిరుకోట్టియూర్ అనే గ్రామం. అక్కడ ఓ మహానుభావుడున్నాడు. పేరు గోష్ఠీపూర్ణులు. రహస్యాల్లోకెల్ల పరమరహస్యమైన మంత్రోపదేశం పొందాలని శ్రీ రంగం నుంచి తిరుకోట్టియూర్ కి నడిచి వెళ్ళారు ఆచార్యులు. ఇపుడు కాదు మళ్ళీరా అన్నారు గోష్ఠీపూర్ణులు. అలా 17 సార్లు తిప్పించుకున్నారు. రామానుజులలో విసుగు లేదు. అహం తొంగూ డలేదు. పద్దెనిమిదో సారి మంత్రం ఉపదేశం చేస్తానన్నారు. ఎవ్వరికీ చెప్పనని యోగ్యులెవరో పరీక్షించి ఉపదేశించాలని ఎన్నోరకాల ఓట్లు ప్రతిజ్ఞలు చేయించుకుని ఆచార్యులవారికి ఉపదేశించారు. అదే అష్టాక్షరీ మంత్రం. ఓం నమో నారాయణాయ.


వందలకి.మీ నడిచి ఇంత శ్రమపడితే కానీ నాకీ తిరుమంత్రం లభించలేదు. ఇక సామన్యుల మాటేమిటి. వారి గతి అథోగతి పాలు కారాదని నిశ్చయానికి వచ్చేశారు రామానుజులు. వెంటనే ఆ ఊరి గోపురం ఎక్కాడు. అందరినీ పిలిచాడు. మంత్రాన్ని అందరిలో పలికించాడు. విషయం గురువుగారికి తెలిసింది. పిలిపించాడు శిష్యుడిని. పరమ గోప్యమైన మంత్రాన్ని పదిమందికి చెప్పినందువల్ల నరకానికి పోతావు అని కోప్రో కంతో ఊగిపోయాడు గోష్ఠీపూర్ణులు. అంతమంది మోక్షానికి వెళ్తారు. నేనొక్కడిని నరకానికి పోతాను. బహుజన హితాయ బహుజన సుఖాయ. అది రామానుజుల జవాబు. శిష్యుని ఔదార్యానికి త్యాగానికి గోష్ఠీపూర్ణులు ఆశ్యర్యానందాల్లో మునిగిపోయారు. ఆయన కోపం ఎటో పారిపోయింది.


ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం


ఉత్తములకి క్షణకాలమే ఉంటుంది కోపం. మధ్యములకి 48 నిముషాలుంటుంద. అధమునికి ఒక రోజంతా ఉంటుంది. పాపాత్మునికి చచ్చేంత వరకు (బ్రతికినంత కాలం) ఉంటుంది. రామానుజులను దగ్గరికి తీసుకున్నాడు. గట్టిగా కౌగలించుకునాడు. ఎంబె మానార్ (నా దేవుడా) అని పిలిచారు ఆచార్యులను. అందుకేనేమో భగవత్ రామానుజులయ్యారనిపిస్తోంది. , శరణాగతి మూడు రకాలు. స్వామీ నాకేం తెలియదు. పాల ముంచినా నీవే. నీట ముంచినా నీవే. నిన్నే శరణు వేడుతున్నాను అంటారు అజ్ఞానులు లేదా పామరులు. ఇది ఒకరకం. దేవా నేను పరతంత్రుడను. నా రక్షణ నేను చేసుకోలేను. సర్వస్వతంత్రుడవు నీవు. నీవే నా రక్షకుడివి. శరణాగతి చేస్తున్నా అంటారు భక్తులు. ఇది రెండో రకం. హే భగవాన్ నీ కళ్యాణ గుణాలను నీ లీలా విలాసాలను స్మరించటంతోనే సరిపోతోంది. నీ కోసం నేనేం చేయలేకపోతున్నా. నీవు నావాడివి. నన్ను నీ దరి చేర్చుకో అంటరు జ్ఞానులు. ఇది మూడో రకం. నేను నీ వాడిని అంటే జీవుడు దాసుడు. దేవుడు ప్రభువు. నీవు నావాడివి అంటే జీవుడు స్వతంత్రుడు. దేవుడు పరతంత్రుడు. పుండరీకుని దగ్గరికి వెళ్ళాడు పాండురంగడు. ఆ సమయంలో తల్లితండ్రులకి సేవలు చేస్తున్నాడతను. నేను వచ్చేవరకు ఈ రాయి మీద నిలుచో అని ఓ ఇటుకరాయి విసరివేశాడు. పాపం ఆ దేవుడు భక్తుడు వచ్చేవరకు ఆ రాయి మీద నిలబడి ఉన్నాడు.


సూరదాసు గుడ్డివాడు. కృష్ణభక్తుడు. ఒక్కడే బృందావనం బయలుదేరాడు. చేతి కర్రతో తారాడుకుంటూ వెడుతూ దారి తప్పాడు. పరమాత్మని నమ్మిన వాడెన్నటికీ చెడిపోడు కదా. బాలకృష్ణుడు వచ్చాడు. తాతా అని చేయి పట్టుకున్నాడు. నడిపించాడు. బృందావనం పొలిమేరలో వదిలేసి మాయమయ్యాడు. అపుడు తెల్సుకున్నాడు. దాడూ పినవాడు కృష్ణభగవానుడని. కృష్ణా నీవెంత మోసగాడివి. నా చేతినించి తప్పించుకొని పోయావ్. నీకు పౌరుషం ఉంటే ఈ నా హృదయంలోంచి పారిపొ ద్దాం అన్నాడు. అలా భక్తి పండిన మతో కొందరు భక్తులు పరమాత్మని నిలబెట్టగలరు. బస్తీమే సవాల్ అని ఛాలెంజి చేయగలరు. - ఆధ్యాత్మ రామాయణంలో ఆంజనేయుడంటాడు - రామా దేహాభిమానంతోచూ స్తే నేను దాసుడను. నీవు ప్రభువు. జీవతత్వంతో పోలుస్తే నీవు దేవాది దేవుడవు. నేను నీ అంశ. ఉపాధి రహితందూ స్తే నువ్వే నేను. నేనే నువ్వు.


మళ్ళీ మనం శ్లోకంలోకి వద్దాం. పదో అధ్యాయంలో దదామి బుద్ధి యోగం అన్నాడు. నన్ను తెల్సుకోగల బుద్ధిని నిర్మల జ్ఞానాన్ని తత్వ రహస్యం తెల్సుకునే జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తానన్నాడు. అయితే పాపరాశినంతటినీ భస్మం చేసి దరి చేర్చుకుంటాననలేదు. అక్కడ భక్తినిస్తానన్నాడు. ఇక్కడ ప్రపత్తినిస్తానంటున్నాడు. ప్రపత్తికి మహా విశ్వాసం అవసరం. గాండీవం వదిలేసి చతికిలపడినప్పుడు ఏడ్వవద్దన్నాడు. ఇపుడు ఇక్కడ మాశుచః దుఖించవద్దన్నాడు. ప్రపన్నుడవై శరణాగతి చెయ్. కర్మ ధర్మాలు త్యజించు. నేను ఉన్నాను. నన్ను నమ్ము. అని భరోసా ఇచ్చినా నమ్మకం కుదరక ఏడ్చాడు. ఎందుకని ప్రశ్న. కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగంలో మోక్షమార్గానికి చెప్పిన ఉపాయాలు సాధనలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఎన్ని జన్మల నుంచో పేరుకుపోయిన పాపరాశికి ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. వాటికోసం మళ్ళీ ఎన్ని జన్మలెత్తాలని శోకిస్తున్నాడని అనుకోవాలి. అందుకే ఓ అర్జునా నీకా బెంగ వద్దు. ఈ జన్మలో ఇపుడే నీ పాపరాశిని భస్మం చేస్తా. ఒక్కసారి ప్రపత్తి చెయ్ చాలు. చెప్పింది చెయ్. ఏదైనా వస్తే గిస్తే పూచీ నాది. నిన్ను గట్టెక్కిస్తా. ఇక దుఃఖించకు అని వీపు తట్టి ధైర్యం చెప్పినట్లున్నాయి భగవానుని పలుకులు. నేను చేస్తున్నా, నాకోసం, ఇదంతా నాదే అన్న భావన వదిలెయ్యాలి. పరమాత్మని ప్రగాఢంగా విశ్వసించాలి. ప్రపత్తి చేయాలి మనం. ఆ స్వామిని చేరటానికి అడ్డుపడే పుణ్య పాపరాశినంతటినీ పోగొడుతాడు. ముక్తినిస్తాడు. బాగా ఆలోచిస్తే ఈ శ్లోకం ఒక గ్రంథి శ్లోకం. కూట శ్లోకం.


వ్యాస గుట్టు అని ఒకసారి మొదట్లో చెప్పుకున్నాం. అయినా పునరుక్తి దోషం కాదు. వ్యాసదేవుడు చెబుతుంటే గణపతి దేవుడు రాస్తానన్నాడు. అయితే నా కలం ఆగదు. ఆగకుండా చెప్పాలన్నాడు వినాయకుడు. నేను చెప్పింది నీకు అర్థమైనపుడే అక్షరబద్ధం చేయాలన్నాడు మహర్షి. ఇద్దరి షరతుల మధ్య మనకు వచ్చింది చిక్కుముడి. ఆశువుగా చెబుతున్నాడు. ఎక్కడో ఓచోట భావాలు ఆలోచనలు ఆగిపోవచ్చు. ఆ సమయం ముందే ఊహించి ఓ జటిలమైన అన్వయ కాఠిన్యమైన శ్లోకం చెప్పేవాడు వ్యాసుడు. దాన్ని అర్థం చేసుకుని వినాయకుడు రాసే లోపల మళ్ళీ థాట్స్ కొత్త ఆలోచనలు భావాలు వస్తూ కథా గమనానికి ఆశువుకు ఆటంకం ఏర్పడకుండా సాగిపోయేది. ఆయా శ్లోకాలను వ్యాసగుట్టు అని కూట శ్లోకమని గ్రంథి శ్లోకమంటారు పెద్దలు . ఉదాహరణకి రెండో అధ్యాయం 69వ శ్లోకం యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ అనేది వ్యాసగుట్టుగా అక్కడ చెప్పుకున్నాం. అలాంటివి అక్కడక్కడ వచ్చాయి. ఇక్కడ ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న శ్లోకం కూడా వ్యాసగుట్టుగా భావించాలి. సర్వధర్మాలు కర్మలు వదిలేస్తే ఎలా అని ప్రశ్న. వ్యాఖ్యాతలు తమ భావాలను యథాతథంగా పొందుపరచారు. అందరి భావాలను వ్యాఖ్యానాలను మనం ఆదరించాలి. గౌరవించాలి.


అర్జునా నేను చెప్పింది విన్నావు కదా. బాగా ఆలోచించుకో. యథా ఇచ్చసి తథా కురు. నీకు తోచినట్లు చెయ్ అన్నాడు. జీవునికి కొంత స్వేచ్ఛ ఇస్తాడు. మళ్ళీ ఆ స్వేచ్ఛా స్వాతంత్యాల్ని లాక్కుంటూ సర్వ ధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాల్ని సర్వ సాధనల్ని నాకిచ్చెయ్. నాకు శరణాగతుడివి కావాలంటాడు. ఇది భగవత్ ఉపదేశంలోని రహస్యం. జీవుడు స్వతంత్రుడు కాదు. పరతంత్రుడు. నాదంటూ ఏమీ లేదు. అంతా నీదే స్వామీ అన్న సద్భావన దృక్పథం మనస్సులో నాటుకోవాలి మనకు. అపుడే భగవదనుగ్రహప్రాప్తి మోక్షం లభిస్తాయి. భగవానుని గీతోపదేశం అశోచ్యా (2-11) శోకించకుతో ప్రారంభమై మాశుచః (18-66) దుఃఖించకుతో అంతమవుతోంది. సంసార దుఃఖ ధ్వంసం అఖండ ఆనందరూప మోక్షం గీతోపదేశ ప్రధాన లక్ష్యం. - ఇక్కడితో కృష్ణభగవానుని గీతోపదేశం పరిసమాప్తమైంది. పరమ పవిత్రమైన నిత్యానుష్ఠానుమైన గీతాశాస్త్రం చెప్పుకున్నాం. ఇదంతా భగవదనుగ్రహమే. కృష్ణభగవానునికి శతకోటి నమస్సుమాలు. గీతలోని పద్దెనిమిది అధ్యాయాల సారభూతమైన శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్నదాన్ని భక్తి శ్రద్ధలతో అనుసంధానం చేస్తే త్రికరణ శుద్ధిగా శరణాగతి చేస్తే ఆ స్వామి మోక్షసామ్రాజ్యంలోకి తీసుకెళ్తాడు మనల్ని. ఇక చివరగా భగవద్గీతకున్న విధి విధానాలను వివరిస్తున్నాడు. ఇదంతే నాతపస్కాయనాభక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యంన చమాం యో7భ్యసూయతి || 67


తపస్సు చేయనివాడికి, భక్తి లేనివాడికి, వినాలనే ఇష్టం లేనివాడికి ఈ గీతాశాస్త్రం చెప్పరాదు. అలాగే నన్ను ద్వేషించేవారికి ఏనాటికీ చెప్పొద్దు.. గీతాశాస్త్రానికి అనర్హులు నలుగురు. 1. నా తపస్కాయ - తపస్సు చేయనివాడు. తపస్సంటే మనోనిగ్రహం లేనివాడు. ఈర్య ద్వేషం కామ క్రోధాది అసుర గుణ సంపత్తి కలవానికి భగవద్గీత వినే అర్హత లేదు. 2. న భక్తాయ - భగవంతుని మీద విశ్వాసం లేనివాడు. వేదశాస్త్రాలను గౌరవించనివాడు. వినయ విధేయతలేనివాడు. ఇలాంటివాడికి గీతోపదేశం చేయరాదు. 3. అశుశ్రూషన్ - వినాలని కుతూహలం లేనివానికి అని అర్థం. కాని వాస్తవానికి శుశ్రూష అంటే రెండు అర్థాలు. ఒకటి వినాలనే కోరిక. సేవ లేదా పరిచర్య అని రెండో అర్థం. గురుజనులకు పరిచర్యలు చేయాలి. తత్ విద్ది ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయా 4-34లో అన్నాడు. జ్ఞానులను గురుజనులను పెద్దలను దర్శించాలి. వారి అనుగ్రహం పొందాలి.


వారికి నమస్కరించాలి. సేవలు చేయాలి. అలాంటి సద్బుద్ది సత్ ప్రవర్తన లేనివానికి గీతను బోధించరాదు. వానికా అర్హత లేదు. తపస్వి అయినా వినాలని ఇష్టం లేకపోతే, భక్తుడైనా వినకోరని వాడైతే, సేవాభావం లేనివాడైతే గీతోపదేశం చేయరాదు. ఇక నాల్డోది దేవుడంటే ద్వేషించేవానికి అస్సలు చెప్పరాదు.పరమాత్మ పరమభావాన్ని తెలియని మూడులున్నారు. లోకకళ్యాణం కోసం ధర్మసంస్థాపన కోసం అవతరించినా మానవమాత్రునిగా తలచే నాస్తికులకి గీతను వినిపించరాదు. మనో బుద్దీంద్రియాల్ని తపింపచేసే తాపసి కాకపోయినా పరమాత్మ మీద భక్తి లేకపోయినా పెద్దలను సేవించే అవకాశం లేకపోయినా భగవత్ ద్వేషి కాకపోయినా భగవత్ సంబంధమైన విషయాలు వినాలనే కుతూహలం ఉన్నవాడికి గీతను తెలియచెప్పొచ్చు. ఇది ఈ శ్లోకంలోని ఒక విశేషం. గీతకు అయోగ్యులు అనధికారులను ఒక శ్లోకంలో చెప్పిం తరువాత అధికారులైన భక్తులకు గీతను చెబితే ఫలమేమిటో రెండు శ్లోకాల్లో వివరిస్తున్నాడు భగవానుడు.


య ఇమం పరమం గుహ్యం మదృశ్లేష్యభిధాస్యతి | భక్తిం మయి పరాంకృత్వామామేవైష్యత్యసంశయః|| 68


అతి రహస్యమైన ఈ గీతా శాస్త్రాన్ని ఎవడు నా భక్తులకు వివరించి చెబుతాడో అతడు నాపై పరమభక్తి కలవాడై నిస్సంశయంగా నన్నే పొందుతాడు. గత శ్లోకంలో నాలుగు దోషాలున్నవారిని గూర్చి చెప్పాడు. ఇపుడిక్కడ కేవలం భక్తుని ప్రశంసిస్తున్నాడు. గీతోపదేశానికి భక్తుడే అధికారి. ఆ భక్తుడు ఏ జాతి మతం కులం వాడైనా పర్వాలేదు. ఆ భక్తులు ఎలా ఉంటారంటే మనస్సు నాకే అర్పిస్తారు. నా కళ్యాణ గుణాల్ని, లీలా విలాసాల్ని, అవతార రహస్యాల్ని కథలు కథలుగా చెప్పుకుంటూ పరస్పరం చర్చించుకుంటూ సంతోషిస్తూ ఉంటారు (10-9). ఎవడు ఈ గీతను చదివి వినిపిస్తాడో, ఎవరు పదిమందికి తెలియచెబుతాడో వాడు ప్రతిఫలాపేక్ష లేని నిష్కామ భక్తుడనిపించుకుంటాడు. భక్తులు నాలుగు రకాలు. 1. భగవత్ కథా శ్రవణాదులంటే ఇష్టపడేవాడు. 2. భగవద్దర్శనం కోరుకొనేవాడు. 3. భగవత్ సన్నిధి చేరాలని తపించేవాడు. 4. భగవత్ వియోగం క్షణకాలం కూడా సహించలేనివాడు. ఈ నాల్గోరకం వారే మయి - నామీద పరాంభక్తి - పరమభక్తిని కృత్వా చేసి అసంశయః సంశయ రహితుడై మామేవ ఏష్యతి - నన్నే పొందుతాడు. భాగవతం చెప్పినవాడు శుకమహర్షి. విన్నవాడు పరీక్షిత్తు. చెప్పినవాడు విన్నవాడు ఇద్దరూ పరమభక్తులై మోక్షం పొందారు. శ్రద్ధాభక్తులతో విన్నవాడు, చెప్పినవాడు, చదివినవాడు పరమపదం చేరుతారని తెలుస్తోంది. భగవత్ గీత కించిత్ అధీత అన్నారు శంకరులు. ఒక్క శ్లోకమైనా భక్తితో చదివినా విన్నా కూడా ఉత్తమగతి చేరవచ్చు.


నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః | భవితానచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి || 69


అలా భగవద్గీతను ప్రచారం చేసినవాడు, వ్యాఖ్యానించినవాడు ఈ లోకంలోని మనుష్యుల్లో నాకు అత్యంత ప్రియమైనవాడు. అలాంటివాడితో మరొకడు సాటిరాడు. అతనికంటే వేరొకడు నాకిష్టమైనవాడు ఉండడు. ఉండబోడు. భగవత్ తత్వాన్ని ప్రచారం చేసేవాని పట్ల భగవానునికెంత ఇష్టమో తెలుస్తోంది. ప్రియం ప్రియతరం ప్రియతమం తమః ప్రత్యయం ప్రయోగింపబడింది. పూజలు జపాలు ధ్యానాలు వ్రతాలు తీర్థయాత్రలు ఇత్యాది పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళందరికన్నా గీతాజ్ఞానాన్ని ప్రచారం చేసేవాడు పరమాత్మ దృష్టిలో పరమభక్తుడు. వానిది నిష్కామసేవ. అందుకే పరమాత్మకి అత్యంత మపాత్రుడవుతున్నాడు. మనం కూడా ఆ పరమాత్మకు ఇష్టులం కావాలంటే గీతాయజ్ఞ వేదికలు ఏర్పాటు చేయాలి. గీతామృతం అందరికీ పంచాలి. సామూహిక పారాయణం చేయటం, మంచి వక్తల్ని పిలిపించి ప్రవచనాలు ఏర్పాటు గావించటం వగైరా కార్యక్రమాలు నిర్వహించాలి. వానికి తగ్గ శక్తియుక్తులు భగవంతుడే ప్రసాదిస్తాడని నమ్మాలి. మదన మోహన మాన్య బాలగంగాధర తిలక్, గాంధీజీ, వినోబాభావే, వివేకానందులు, మళయాళస్వాములు వారి శిష్యులు విద్యా ప్రకాశనందగిరి స్వాములు మరెందరో మహానుభావులు గీతా ప్రచారకులుగా ప్రసిద్ధులు. శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వామివారి గీతా మకరందం మన తెలుగువాళ్ళకి దక్కటం ఒక మహద్భాగ్యం. తర్వాత శ్లోకంలో భగవద్గీత అధ్యయన ఫలాన్ని చెబుతున్నాడు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః | జ్ఞానయజేన తేనాహమ్ ఇష్టః స్యామితి మే మతిః || 70 ఈ ధర్మయుక్తమైన మనిద్దరి సంవాదాన్ని అధ్యయనం చేసేవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధించినవాడవుతాడు. ఇది నా నిశ్చయం. ఏకాదశి పూర్ణిమ అలా కొన్ని ప్రత్యేక దినాల్లో సామూహికంగా భగవద్గీతను పారాయణం చేయటం కద్దు. అర్థ వివరణ కాని విశేష వ్యాఖ్యానాలు కాని చేయకుండా పఠిస్తారు కొందరు. అలా కాకుండా ముఖ్యమైన శ్లోకాలకు అర్థ విశేషాలు క్లుప్తంగా తెల్సుకుంటూ పారాయణం చేయటం లేదా అధ్యయనం చేయటంతే యస్కరం. అలా భక్తి శ్రద్ధలతో వివరణాత్మకంగా అధ్యయనం చేస్తే అది జ్ఞానయజ్ఞం కింద లెక్క. సర్వం కర్మాఖిలం జ్ఞానేన పరిసమాప్యతే (4-33) కర్మలన్నీ జ్ఞానంలో పరిసమాప్తమవుతాయి కదా. జ్ఞాన నిర్దూత కల్మషాః (5-17) జ్ఞానంతో పాపాలు పోగొట్టబడినవారై పునర్జన్మ లేని మోక్ష సామ్రాజ్యం పొందుతారు. ధర్మక్షేత్ర అని భగవద్గీత ధర్మశబ్దంతో ప్రారంభమైంది. సర్వధర్మాన్ పరిత్యజ్య - అని మళ్ళీ ధర్మశబ్దంతో ముగిసింది. కనుక కృష్ణార్జున సంవాదం ధర్మమయం ధర్మమార్గంలో నడిచింది. ధర్మతై అన్న పదంలోని ధర్మ - అనే శ్లోకంలోని చివరి శబ్దం సంజయలోని జయ అన్నదానితో కలిపితే ధర్మమే జయిస్తందన్న విశేషార్థం ధ్వనిస్తుంది.


యజ్ఞం నాలుగు రకాలు. 1. విధి యజ్ఞం - వేదమంత్రాలతో విధింపబడే యజ్ఞకర్మ. 2. జపయజ్ఞం – గట్టిగా మంత్రోచ్ఛారణ గావించటం 3.ఉపాంశుయజ్ఞం -పరీక్షిత్తులాగా కేవలంశ్రవణం చేయటం. నాలుక మాత్రం కదిలిస్తూ శబ్దం వినపడకుండా మౌనంగా మంత్రం జపించటం అన్నారు కొందరు. 4. మానస యజ్ఞం - మానసికంగా మంత్రాన్ని అనుసంధానం చేయటం. నాల్గవది అన్నింటికనాశ్రీ భ్రమైంది. జ్ఞానయజ్ఞం అంటే నిర్గుణ నిరాకార ఉపాసన కావచ్చు. సగుణ సాకార ఉపాసన కావచ్చు (9-15). యజోవై విష్ణువు అన్నారు కదా. యజ్ఞస్వరూపుడు సాకార రూపంలోని విష్ణువు అని నిర్ధారణ చేయవచ్చు. "శ్రదావాననసూయశ్చ శృణుయాదపి యోనరః | స్కోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ || 71 శ్రద్ధ ఉన్నవాడు, అసూయ లేని ఏ నరుడు ఈ గీతాశాస్త్రాన్ని విని పాపాల నుంచి విముక్తుడు అవుతాడో వాడు పుణ్యకర్మలు చేసినవారు చేరే పుణ్యలోకాలను పొందుతారు. భగవద్గీత నియమావళిని ముగించే సమయంలో శ్రద్ధ, అసూయా రాహిత్యం మళ్ళీ గుర్తు చేస్తున్నాడు భగవానుడు. అంటే దైవీ సంపత్తికి చెందిన సద్గుణాలకు భగవానుడెంత ప్రాధాన్యం ఇస్తున్నాడో గమనించాలి. ఇక్కడ ప్రయోగించిన నర శబ్దం స్త్రీ పురుషులిద్దరికీ అన్వయిస్తుందని గుర్తించాలి. .. పాపాలు చేసినవారు పశు పక్షి క్రిమి కీటకాది జన్మలు పొందుతారు కదా. అలాంటి వాళ్ళు ఈ నరజన్మలో గీతను వింటే చదివితే ఆ పాపాలనుంచి విముక్తి పొందటమే కాదు పుణ్యాత్ములు పొందే పుణ్యలోకాలు చేరారు. ఆ పాపిష్టులపై అంత దయా పిన భగవానుడు ఇక భక్తి శ్రద్ధలతో గీతాధ్యయనం చేసిన వారికి, ప్రచారం చేసిన వారికి ఫలమెంతో అంటే ఇక మళ్ళీ జన్మకు రారు వాళ్ళు. మొత్తం మీద భగవదనుగ్రహం లేదా పూర్వజన్మ సుకృతం ఉండాలి. -


సుకృతాలు మూడు రకాలు. 1. యాదృచ్ఛిక సుకృతం - అనుకోకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయటం. ట్రాఫిక్ జాం అయింది. ఇక ఆ రోడ్డులో ముందుకెళ్ళలేం. పక్కగా ఓసందు ఉంది. అటువైపు వేంకటేశ్వరస్వామి గుడి ఉంది. ఆ గల్లీలోంచి వెళ్ళడంలో గుడికి ప్రదక్షిణం చేసినట్లు అయిందనుకోండి. ఆహా నాకు ప్రదక్షిణం చేసి వెడుతున్నాడు అని ఆనందిస్తాడు పరమాత్మ. 2. ప్రాసంగిక సుకృతం - ఆఫీసులో కాని ఇంట్లో కాని పనుల లేదా మాటల సందర్భంలో దివ్యదేశాల పేర్లు, దేవుని పేర్లు ఉచ్ఛరించటం. రామకృష్ణా ఆ ఫైల్ ఎక్కడ పెట్టావ్. మన ఆఫీసర్ గారి తిరుపతి ప్రోగ్రాం ఖరారైంది. మన రంగడి పుట్టినరోజు శివ ఫంక్షన్ హాల్లో జరుపుకుందాం. రామకృష్ణ, తిరుపతి, రంగ, శివ ఇలాంటి పేర్లు విని తననే స్మరిస్తున్నారని సంబరపడతాడు పరమాత్మ. అజామీళుడు అవసాన కాలంలో తన కొడుకుని నారాయణ అని పిల్చాడు. కాని భగవానుడు తననే అనుకుని వానికి సద్గతి కల్గించాడు. 3. ఆనుషంగిక సుకృతం - తెలియకుండా పరోపకారం చేయడం. రైల్వేస్టేషన్లో కాని బస్టాండులో కాని బోలెడు సామాన్లతో కూర్చున్నాం. ఎవరో తన సూట్ కేస్ మన సామాన్ల దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. మనం అది గమనించలేదు. వాని సూట్ కేస్ కి కాపలాగా కూర్చుండిపోయాం . కాసేపటికి వాడు తిరిగొచ్చాడు. థ్యాంక్స్ చెప్పేవరకు మనకు ఆ విషయం తెలియదు. అలా పరోపకారం స్వల్పమైనదైనా పరమాత్మ ఆనందంతో పొంగిపోతాడు. పై మూడు సుకృతాలకు తగ్గ ఫలం అందిస్తాడు భగవానుడు. శ్రద్ధావంతులై, అసూయా రహితులై గీతను వినడం వల్ల వాళ్ళ పాపరాశి భస్మమైపుణ్యలోకాలు పొందటం నాలుగో సుకృతంగా భావిస్తే బావుంటుంది.


                                                                                                                (సశేషం)