పరకామణి సేవలో నా ప్రత్యక్ష అనుభవాలు


తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని సేవ ఏ రూపంలో చేయడం లభించినా జీవితంలో లభించిన మహదావకాశంగా భావించవచ్చు. అటువంటి సేవలలో పరమోత్కృష్టమైన పరకామణి సేవాభాగ్యం కల్గటం నా జీవితంలో మహా అదృష్టంగా భావిస్తున్నాను. నా పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ భాగ్యం కల్గింది. 2016 జనవరి నెలలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చూస్తున్న నా శ్రీమతి ఇందిరా భాగ్యనగర్ “65 సంవత్సరాలలోపు రిటైర్డ్ ఉద్యోగులకు పరకామణి సేవ చేసుకునే అవకాశముందంటున్నారు. మీరు దరఖాస్తు పంపండి” అని తెలిపింది. వెంటనే మిత్రుడు విక్రమ్ సహాయంతో ఆన్లైన్లో దరఖాస్తు పంపడం జరిగింది. ఆ తర్వాత 08-03-2016న తి. తి.దే వారి వద్ద నుండి 22-04-2016 నుండి 24-04-2016 వరకు 3 రోజులు పరకామణి సేవకు మెసేజ్ అందినది. రిఫరెన్స్ నెం.160321 గా తెలిసింది. ఆన్లైన్ లో చూడగా ఆ మూడు రోజులలో 'బి' బ్యాచ్ కు అనుమతి ఇచ్చి ఉన్నారు. ఆ పరమాత్మ ప్రసాదించిన అదృష్టానికి మేము చాలా సంతోషించాము.పరకామణి సేవలో నా ప్రత్యక్ష అనుభవాలు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకున్నాము. . ఇటీవల పరకామణి సేవలో పునీతులైన శ్రీ సత్యనారాయణ గారు, డి.ఇ.ఓ ఆఫీసు వారిని కలిసి వివరాలు తెలుసుకొనగా, సేవలో తెల్లని కట్బానియన్, తెల్లపంచె తప్పక ధరించవలెనని తెలిపారు. 21-04-2016 వ తేదీన ఉదయం 3 గంటలకు ఒంగోలు ఇంటివద్ద పూజాదికాలు ముగించుకుని బయలుదేరి 12 గంటలకు తిరుమలలోని ఎ.పి.ఎస్.ఆర్.టి.సి బస్టాండ్ ప్రాంగణంలోని సేవాసదన్లో రిజిస్టర్ చేశాను. అనగా రిపోర్టు చేశాను. అక్కడి అధికారులు నా ప్రభుత్వ గుర్తింపు కార్డు నకలు తీసుకొని పరిశీలించి మధ్యాహ్నం 2.30 తర్వాత రమ్మన్నారు. 3 గంటలకు సేవాసదన్లోని సమావేశం హాలులో సుమారు 200 మంది సేవకులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరకామణి సేవావిధానం, నియమ నిబంధనలు మరియు సెక్యూరిటీ చెక్ పద్దతులు చక్కగా వివరించారు. సాయంత్రం సుమారు 6 గంటలకు వరాహస్వామి అతిథి గృహం దగ్గర, శంకరకృపకు ఎదురుగా ఉన్న పరకామణి సేవాసదనకు ఉచిత బస్సులో చేరాను. ఆ ప్రయాణంలోనే దైవదత్తమైన ఇద్దరు మిత్రులు ఐ.ఓ.బి రిటైర్డ్ మేనేజర్స్ హైదరాబాద్ వాస్తవ్యులు, కృష్ణ మరియు గోపాలకృష్ణ గారు కలిశారు. తిరుమలలో ఉన్న 3 రోజులు మాత్రమే కాక, ఆ తర్వాత కూడా వారి మైత్రీబంధము అనిర్వచనీయము. అన్ని విషయాలలో ఎంతో సహాయకారులుగా సేవాసదన్లోని వసతులు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. బెడ్స్, టాయిలెట్స్, ఫ్యాన్స్, లాకర్స్ ఎంతో వసతిగా ఉన్నాయి. అక్కడి అధికారులు మరియు మిగతా సిబ్బంది ఎంతో సేవాభావంతో కర్తవ్య నిర్వహణలో ఉన్నారు. గ్రౌండ్ లో 125 మందికి, ఫ లో 125 మందికి విశాలమైన హాల్స్ లో వసతి ఇంటిని మరపించింది. అక్కడ ఒక సేవా స్కార్ప్ ఇచ్చారు. 22వ తేదీ ఉదయం 6.30 గంటలకు రుచికరమైన వడ, పొంగలితో టిఫిన్ పూర్తయి 'ఎ' బ్యాచ్ వారు 7 గంటలకు ఆలయానికి వెళ్ళగా, 'బి' బ్యాచ్ వారమైన మేము 9 గంటలకు బయలుదేరి కాలినడకన సమీపంలోని ఆలయ ప్రాంగణం చేరుకున్నాము. అక్కడ సెక్యూరిటీ వారు సంబంధిత రిజిస్టర్ లో సంతకాలు తీసుకొని ఆరోజుకు అడ్మిషన్ పాస్ ఇచ్చినారు. ఉదయం 9.45 గంటలకు ము తర్వాత తెల్లబనియన్, తెల్ల ధోవతి, స్కార్ప్ మరియు ఐడి కార్డ్ మాత్రమే ధరించి ఆనందనిలయం ప్రవేసించడం అత్యంత ఆనందదాయకం. దేవదేవుని దర్శనానంతరం పరకామణి సేవాకేంద్రం లోనికి పకడ్బందీ సెక్యూరిటీ చెక్ తదనంతరం ప్రవేశించటం జరిగినది. ఈరోజు నాణాల విభాగంలో నాణాలను జల్లెడ పట్టి, గోతాలలో వేసి సీలుచేయు విభాగానికి కొంతమందిని, కరెన్సీని విడగొట్టు విభాగానికి కొంతమందిని కేటాయించారు. 1 గంటకు తిరిగి సెక్యూరిటీ చెక్ తర్వాత మధ్యాహ్న భోజనానికి వెలుపలకు వచ్చి, టిటిడి ఉద్యోగుల భోజనశాలలో ఉచిత భోజనం చేసి, పరకామణి సేవలో కొంతసేపు సేదతీరి, తిరిగి సాయంత్రం 4 గంటలకు సాయంత్రం షిప్లో మరల ఒకసారి శ్రీవారిని తనివితీరా దర్శించుకొని 6 గంటల వరకు కరెన్సీని లెక్కించే కార్యక్రమంలో పాల్గొని 8 గంటలకు శ్రీవారి ప్రసాదం సేవించి బయటకు వచ్చాము. ఒకేరోజు రెండుసార్లు స్వామివారి దర్శనం గావించుకొనుట ఎంత ఆనందాన్ని కల్గించిందో మాటలలో చెప్పలేను. రాత్రి భోజనానంతరం సేవాసదన్లో నిద్రించుట కూడా ఒక భాగ్యమనిపించింది. ఈ రెండవరోజు కార్యక్రమంలో అదేవిధంగా 2 సార్లు దర్శనం మరియు కరెన్సీ నోట్ల విభజనలో పాల్గొన్నాము. వేర్వేరు దేశాల కరెన్సీ నోట్లను, భక్తులు సమర్పించే కొన్ని సువర్ణ, వెండి వస్తువుల విరాళాలు కొన్నిటిని చూచి చాలా సంతోషించాము. ఇది ఒక అపూర్వమైన ఆనందంగా తోచింది. ఆరోజు సాయంత్రం మా బి-బ్యాచ్ లీడర్ అందరికీ రు.160/- ల విలువైన పెద్దలడ్డు, 3 చిన్నలడ్లు, 1 వడ సేవకులందరికీ అందించారు. ఆ పైకం అంతకుముందే మావద్దనుండి సేకరించియున్నారు. 3వ రోజు పరకామణి సేవ తిరుపతిలో కేటాయించారు.


అందువలన ఉదయం 7 గంటలకు టిఫిన్ పూర్తి చేసుకొని, ప్రత్యేక బస్లో 9 గంటలకు గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో గల పరకామణి భవనానికి చేరాము. అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ తదుపరి నాణాలను విభజించే కార్యక్రమంలో పాల్గొన్నాము. అక్కడ కూడా టిఫిన్, భోజన వసతులు మంచి రుచికరంగా ఉన్నాయి. ఉద్యోగుల భోజనశాలలోని భోజనం ఎంతో రుచి శుచిలతో ఉండి అందరికీ ఆరోగ్యదాయకంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అక్కడ శ్రీవారి సేవకుల సేవలు ఎంతైనా అభినందనీయం. - సాయంత్రం డ్యూటీ ముగించుకుని 4 గంటలకు తిరిగి ఒంగోలు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరాను. నా ఈ అనుభవం జీవితంలో మరువలేనిది. భగవంతుని దయ నాకు కల్గినది అని ఎంతో ఆనందం పొందాను. అవకాశం ఉంటే ఎన్నిసార్లయినా సేవ చేయాలన్పించే మధురానుభూతి, అదే ఆ కొండలరాయని మహిమ. శ్రీవారి సేవాభాగ్యము పూర్వజన్మ సుకృతం. పరమాత్మ సన్నిధి, దర్శనం పరమానంద భరితం. ప్రతివారు జీవితంలో ఒక్కసారైనా సేవలో పాల్గొనే భాగ్యం కొరకు ప్రయత్నించడం కర్తవ్యంగా భావించాలి. పవిత్రమైన కార్యంగా ఆచరించాలి. స్వామి దయ ఉంటే లేనిది ఉండదు కదా! తప్పక సేవాభాగ్యం లభిస్తుంది. ప్రయత్నించండి, తరించండి.