గత సంచిక తరువాయి వైనతేయుడు మహావీరుడిగానే కాక మహాభక్తుడిగా కూడా మహర్షుల చేతనే వినుతింపబడ్డాడు. అత్యంత తపోనిరతుడై విష్ణు తత్యాన్నే గ్రహించిన కారణ జన్ముడు. మాతాపితల పట్ల భక్తి ప్రపత్తులు కలిగి, వారి ఆశీస్సులతో అనేకానేక విషయ సంగ్రహణం చేసి, వారి ఆజ్ఞానుసారం బదరికావనం ప్రవేశించి చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుని దర్శించిన పుణ్యాత్ముడు. “అవ్విశ్వరూపునకు శాశ్వత పరిచర్య సేయంగల వాడవగుటం గృతారతం బొందితి” అని పితృదేవుడైన కశ్యప బ్రహ్మ చేతనే అభినందింపబడిన పరమభక్తుడు గరుడుడు. - 354 వచనం - ప్ర.ఆ - ఆనుశాసనిక పర్వము ఒకానొక సమయంలో గరుత్మంతుడు హిమాలయ పర్వతాలలో సంచరిస్తూ, పర్వత సౌందర్యానికి ముగ్ధుడై విహరిస్తూ, ఆ పర్వత సానువుల మీద ఆధ్యాత్మిక చర్చ చేస్తున్న మునులను చూసి ఆగి, వారికి నమస్కరించాడు. మునులు కూడా కశ్యపాత్మజుని చూసి ఆనంద పరవశులైనారు. “గరుత్మంతా! నీవు మహాత్ముడవు. విష్ణుమూర్తికి ప్రియ భక్తుడివి. విష్ణువు కూడా భక్తులంటే ఎంతో ఇష్టం గలవాడు కదా! నీవా విష్ణువుకు ఎల్లవేళలా ఇష్టుడవై, భక్తుడవై ఆయన వద్దనే ప్రవర్తిస్తుంటావు. ఆ దేవదేవుని సేవలో తరిస్తుంటావు. నీకు విష్ణువు గూర్చి తెలియని విషయమంటూ ఏదీ ఉండదు. విష్ణు తత్యాన్ని అంతా మాకు తెలియజెప్పు గరుడా!” అని మునులందరూ కోరడంతో విష్ణుభక్తిలో లీనమైపోయి క్షణం నిరుత్తరుడైనాడు గరుడుడు. నారాయణుడి పాదపద్మాలకు మనస్సులోనే నమస్కరించి వారడిగిన విష్ణుతత్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. “ముని శ్రేష్ఠులారా! భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడన్న విషయం మనకు స్థూలంగా తెలిసినది మాత్రమే. అంతమాత్రం చేత ఆయన విషయం గాని, రూపురేఖలు గాని, అనంత మూర్తులు గాని, విశేషించి విష్ణుతత్త్యం గురించి కాని నాకు సంపూర్ణంగా తెలుసని చెప్పలేను. నాకూ, మీకే కాదు ఎవరికీ కూడా వైకుంఠుని మహిమాతిశయం తెలియదు. ఒక విషయం మాత్రం చెప్పగలను. నేను ఇంద్రుని జయించి అమృతాన్ని తెస్తున్నప్పుడు - ఒక మహానుభావుడు నాకెదురైనాడు. అతడు మహెజ్జ్వలమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. నన్ను చూసి చిరునవ్వు చిందిస్తూ - గరుడా! “జరయు మరణంబు లేక యసురుల సురల నోర్వజాలిన బలముతో నుల్లసిల్లు" మని వరమిచ్చాడు. నాకు వాహనంగా, కేతువుగా వర్ధిల్లమ'ని ఆనతిచ్చి అంతర్థానమైనాడు. ఆ వచ్చినవాడు - ఏ మహాత్ముడో, ఏ దేవుడో తెలుసుకోలేక నా తండ్రినడిగితే - అతడే పరమాత్ముడైన శ్రీమహావిష్ణువని, ఆ పరంధాముని సేవలో తరించమని ఆనతిచ్చిన కశ్యపుడు నాకు కర్తవ్యోపదేశం చేశాడు. తండ్రి ఆనతితో బదరికాశ్రమాన్ని చేరి నారాయణుని స్తుతించాను. ధ్యానించాను. నా పిలుపు విన్న జ్యోతి స్వరూపుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై నన్ను తన వెంట రమ్మన్నాడు. అంతే. విష్ణువు వెంట పరుగెత్తుతూ అనేక వేల యోజనాలు పోయాను. అక్కడ మహాగ్ని కనిపించింది. దానిలోకి ప్రవేశించాను. అక్కడ అత్యాశ్చకరమైన దృశ్యం కనిపించింది. ఆ అగ్నిలో పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న అద్భుత సన్నివేశాన్ని దాటి విష్ణువు మరింత వేగంగా వెళుతున్నాడు. అప్పటికే నాకు మిక్కిలి అలసట ఏర్పడింది. అయినా ఆయన వెంట మరింత వేగంగా వెళుతున్నాను. అలా చాలా దూరం పోయిన తరువాత గాఢాంధకారంతో నిండి ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు విష్ణువు. అక్కడ వెలుతురు లేదు. సూర్యుని కాంతి మచ్చుకైనా కనబడలేదు. అంతా చిమ్మచీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించటం లేదు. నాకు దిక్కు తోచలేదనుకోండి మహర్షులారా!” అన్న గరుడుని మాటలతో తదేక ధ్యానంతో వింటున్న మునులందరూ ఇహలోకంలోకి వచ్చి పడ్డారు. గరుడుని చూశారు. “అప్పుడేం జరిగింది. మహాత్మా! విష్ణువు కనిపించనే కనిపించలేదా?” అని ఉత్కంఠతో అడుగుతున్న మునులను సాభిప్రాయంగా చూశాడు గరుడుడు. “అయోమయ స్థితిలో ఉన్న నేను 'దేవదేవా! నాకంతా అగమ్య గోచరంగా ఉంది. ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఎలా వెళ్ళాలో తెలియలేదు. నన్ను కరుణించి దారి చూపు' అని నారాయణుని ప్రార్ధించాను. వెంటనే 'ఈ వైపుకు రా' అన్న తీయని వాక్కు వినిపించింది. దుఃఖంతో, దాహంతో, శ్రమతో, ఓర్చుకోలేని అలసటతో 'పరమాత్మా! శరణు. శరణు! అని ఏకాగ్రచిత్తంతో వేడుకొన్నాను. అంతే. మునులారా! అప్పటివరకూ ఉన్న చీకటంతా మటుమాయమైపోయింది. సంతోషం నన్నావరించింది. వెలుతురు చూసేసరికి నాలో ఉత్సాహం పెల్లుబికింది. భగవంతుడెక్కడ ఉన్నాడా అని అన్ని వైపులా చూశాను. ఆ మహితమూర్తి అద్భుతంగా దర్శనమిచ్చాడు. 'ధన్యుడినయ్యానని తృప్తి చెందాను. ఆ స్వామి రూపం వర్ణనాతీతమనుకోండి. అయినా నాకు తోచినంత చెబుతాను. పట్టపగలు సూర్యుడెలా వెలిగిపోతాడో - అలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు నారాయణుడు. ఆ ప్రదేశంలో సూర్యకాంతికి గాని, నక్షత్ర తేజానికి గాని, చంద్రద్యుతికి గాని స్థానం లేదు. దేవతలు మొదలైన సకల ప్రాణులకు అది చొరరాని ప్రదేశంగా ప్రకాశిస్తోంది - ఆ దివ్యమంగళ స్వరూపుని రూపవతులైన స్త్రీలు, తేజోవంతులైన
మునీంద్రులారా! విష్ణుదేవుడికి నేనన్నా, నా తల్లి వినత అన్నా, నా తండ్రి కశ్యప మహర్షి అన్నా ఎంత వాత్సల్యమో చూడండి. తండ్రి చెప్పగా విని నా దర్శనానికి వచ్చిన నిన్ను నేను మఱచిపోతానా? పైగా, నీవు వినతా సుతుడివి. ఆ మహా సద్గుణవతికి జన్మించిన నీవు నా సేవకై వచ్చావని నాకు తెలియదా? భయమనేది లేకుండా ఇటువైపు రావయ్యా! నేను ఇక్కడే ఉన్నాను. నేను కనబడలేదని వేదన చెందకు. నేను అందరకూ కానరాను గదా! నిష్ఠాగరిష్టుడవై నీవు నన్నే త్రికరణశు ద్ధిగా భావిస్తుండటం వల్ల ఎల్లప్పుడు నీవు నా స్థూలరూప దర్శనం కలిగి పవిత్రాత్ముడవై ప్రకాశిస్తావు. ఇది నా వరం. "వైనతేయా! ఇక నీకు అగ్నిబాధ ఉండదు. నీవు నాతో ఎంతదూరం రాగలుగుతావో చూసుకో!” అని అంటూ దూరంగా పోయి అదృశ్యుడైనాడు విష్ణువు. ఆ పరమాత్ముని మాట ఆధారంగా ఆ సవ్వడి వచ్చిన వైపుగా వెళ్ళాను. అక్కడ ఒక సుందర తామర సరోవరం కనిపించింది. అందులో అందమైన హంసలు నడయాడుతున్నాయి. విచిత్రమేమిటంటే ఆ కొలనులో ఆనందంతో స్నానమాడుతున్న పరమేశుని చూసి దగ్గరగా వెళ్ళాను. వెళ్ళానే గాని, సరస్సులో సరసిజ నేత్రుడు అదృశ్యమయి దర్శనమివ్వలేదు. అంతకుముందు నాతో విష్ణుమూర్తి చెప్పిన మాటలే చెవులలో గింగురుమన్నాయి. “గరుడా! ఆత్మతత్త్వవేదీ! ఒక మాట చెబుతాను విను. నాది, నా వాళ్ళు అనే మమకారం, నేను అనే అహంకారాన్ని మనసులోకి చొరనివ్వకుండా, నిశ్చలమైన బుద్ధితో, ఏకాగ్రచిత్తంతో, శమదమాది సద్గుణాలతో ఉండేవారే విశ్వరూపుడనైన నన్ను చూడగలుగుతారు. నీది నిశ్చలమైన దృష్టి కనుక దర్శనమిచ్చాను”. దర్శనమిస్తానని చెప్పిన విష్ణువు కనబడలేదు. నాలో ఏ దోషం ఉందో తెలుసుకోలేకపోయాను మహర్షులారా! ఎక్కడ భగవంతుడున్నాడో అని అన్ని వైపులా చూశాను మళ్ళీ. విష్ణుమూర్తి కానరాలేదు సరికదా! అనేక అగ్నిహోత్రాలు వెలుగుతూ కనిపించాయి. వేదమంత్రాలు చదువుతున్నట్లు వినిపించాయి. గాని చదువుతున్న వారెవరూ కనిపించలేదు. భయభ్రాంతులను కల్పిస్తూ క్రూరమైన గరుత్మంతుల గుంపులు ఎన్నో గరుత్మంతుడనైన నామీద విరుచుకుపడ్డాయి. మొదట్లో భయమేసింది. తరువాత ఆశ్చర్యం కలిగింది. దేవుడింత వింత నాటకం ఆడుతున్నాడేమిటని ప్రశ్న ఉదయించింది. నా భక్తిలో లోపమేమోనని అనుమానమేర్పడింది. ఏది ఏమైనా గరుడ పక్షులన్నీ రెక్కలు విప్పి నామీదకు విజృంభించేసరికి పరమాత్ముని శరణు వేడాను. నేను చేసిన స్తోత్రాలు దేవ దేవుని వీనులకు వినపడ్డాయి. ఆయనలో కరుణ చోటు చేసుకుంది. భక్తుని పరీక్షించటం ఇక చాలనుకొన్నాడో ఏమో తెలియదు గాని తన దివ్యసుందర రూపాన్ని అనుగ్రహించాడు.
మునులారా! విష్ణువు దర్శనమివ్వటమే కాదు, 'నన్ను భయపడకుమ'ని శరణు ప్రసాదించాడు. నా దేవుడి లీల, నా భగవంతుని మహిమ ఎంత గొప్పదో తెలుసా? ఒక్కసారిగా మేమిద్దరమూ ఉన్నచోటు బదరికాశ్రమంగా మారిపోయింది. నేను తొలిసారి ఆ చతుర్బుజ రూపుని ఎలా చూశానో అలాగే ఉన్నాడు. ఎక్కడ చూశానో అక్కడే ఉన్నాడు. అదంతా ఆ విశ్వరూపుని భక్తపరీక్ష కాకపోతే - అన్నిసార్లు నన్ను భయభ్రాంతుని చేయటం ఎందుకు? అన్నిసార్లు నన్ను కరుణించి వరాలివ్వటం ఎందుకు? అదంతా ఆయన ప్రభావం. ఆలోచనలకు లోనై ఆయన చెంతకు చేరాను. రెండు చేతులూ జోడించి నమస్కరించాను. మీరు నన్నడిగిన ప్రశ్ననే నేనూ అడిగాను పరమాత్ముని - నీ అసలు తత్త్వం ఏమిటో వివరించమని కరుణాళువై చెప్పసాగాడు నారాయణుడు. వైనతేయా! నా నిజస్వరూపం దేవ దానవులకెవరికీ తెలియదు. సకల జీవరాశులు నానుంచే పుడతాయి. నాలోనే వర్తిస్తాయి. నాలోనే లయమవుతాయి. నేను సంసార చక్రంలో బంధింపబడను. కాని, అన్నిటిలోనూ ఉంటాను. నా తత్త్వాన్ని నిష్కాములు, అహంకార రహితులు, జడులు కానివారు, హింసకు విముఖులైనవారు, క్రోధవర్జితులు కొంత తెలుసుకోగలుగుతారు. జ్ఞానులు, నిత్యతృప్తులూ, శాంతియుతులు, మహాభక్తులు, నిశ్చలాత్ములు, నిష్ఠాగరిష్టులు కూడా నా తత్త్యం తెలుసుకొని సంతృప్తులౌతారు. ఇన్ని సద్గుణాలున్నవారు, సన్మార్గ ప్రవర్తకులు పరమాత్మ తత్యాన్ని అర్థం చేసుకోవటానికి సమర్థులౌతారు.
వ్యామోహమనే పంకంలో కూరుకుపోతే ఈ అవగాహన కలగదు. వ్రతాలు చేసినా, నియమాలు పాటించినా, ఉపవాసాలు చేసినా వారికి నా తత్త్వం అర్థం కాదు. రజస్తమో గుణాలకు అతీతంగా, కేవల సత్త్వగుణాన్ని మాత్రమే ఆధారం చేసుకొని - ఆజ్ఞానంతో నన్ను ధ్యానిస్తే నా తత్త్వమూ తెలుస్తుంది, మోక్షమూ లభిస్తుంది. గరుడా! నాపైనే మనసు నిలుపు. నన్నే భక్తితో ఆరాధించు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండు. నన్నే ధ్యానించు. ఆ విధంగా చేస్తే నా రూపమూ తెలుస్తుంది. నా తత్త్యమూ అర్థమౌతుంది” అని నాకు విష్ణువు ఉపదేశించాడు. “మహర్షి సత్తములారా! ఇదీ నేను విష్ణుదేవుని నుండి తెలుసుకొన్న పరమార్థం. భక్తిభావనతో చెప్పగలిగానే కాని అది సామాన్య దృష్టికి అందేది కాదు. విష్ణుమూర్తికి వాహనాన్నె, జెండానై, సర్వే సర్వత్రా ఆ పరమాత్ముని సేవలో నిమగ్నుడనై ఒక్కొక్కప్పుడు నన్ను నేనే మరచిపోతుంటాను. విష్ణుభక్తులైన మీకందరికీ నమస్కరిస్తున్నాను” అని గరుడుడనగానే - మునులందరూ గరుత్మంతుని దీవించి యథాస్థానాలకు వెళ్ళిపోయారు. గరుడుడు విష్ణుపూజలో తన్మయుడైనాడు.
పరమాత్ముని నిత్య సేవలో నిమగ్నుడైన గరుడుడు మహాపరాక్రమశాలి, సాహసోపేతుడు, అరివీర భయంకరుడు, త్రిలోక కీర్తనీయుడు కావడంతో ఆ మహాభక్తునిలో కూడా ఒకప్పుడు ఒకింత గర్వం చోటు చేసుకొంది. అహంభావం మనసును ఆకట్టుకుంది. తనను మించినవారు విశ్వంలోనే ఉండబోరనే భావనతో పరమాత్ముని విషయమే మఱచాడు. తన బలానికి, శౌర్యానికి, మహాశక్తికి ఎవరు కారణమో, అవన్నీ ఎవరి దయాధర్మ భిక్షాలో అన్న విషయం విస్మరించాడు. త్రిలోకాధిపతి ఎంతలే అని అతనిమీద ఆగ్రహించాడు. తనను మించిన వారెవ్వరూ లేరని విర్రవీగాడు. ఇంద్రుని సారథి - మాతలి చేసిన పనికి కినుక వహించాడు. ఈ సమస్త విషయమూ దుర్యోధనుడికి కణ్వ మహర్షి చేసిన హితబోధల వల్ల తెలుస్తోంది. పాండవులతోడి సంగ్రామం చేయటానికి పూనుకోవద్దని - అలా చేయటం వల్ల కలిగే నష్టాన్ని విపులీకరిస్తాడు కణ్వుడు. “గరుత్మంతుడంతటి వాడికే పరాజయం తప్పలేదు, భగవంతుడైన శ్రీకృష్ణుడు పాండవ పక్షంలో ఉన్నాడు - వారినెదిరించటానికి నీవెంత? నీ శక్తి ఎంత? సంధికి ఒడంబడు. అహంకరించకు” అని గరుత్మంతుని వృత్తాంతాన్ని తెలియజెబుతాడు కణ్వమహర్షి.
- 289 ప - తృతీయాశ్వాసము - ఉద్యోగపర్వము తన శక్తి ఎంతటిది, ఎదుటివారి శక్తి ఎంతటిది అని గ్రహించకుండా గర్వించటం మంచిదికాదు. ఆ అహంకారమే పక్షీంద్రుడైన గరుడునికి ప్రతాప హీనతను కలిగించింది. దుర్యోధనా! ఏం జరిగిందో, ఎలా జరిగిందో వివరంగా చెబుతాను. విని తెలుసుకో. నీ విధి నిర్వహణలో అప్రమత్తత వహించకు” అని కణ్వుడు చెప్పటం ప్రారంభించాడు. "మాతలి దేవేంద్రుడి రథసారథి అని నీకు తెలుసు కదా. సుయోధనా! ఆ మాతలి తన పుత్రిక అయిన గుణకేశి అనే కన్యకు వరుని వెదకసాగాడు. ఆ అన్వేషణలో సుముఖుడనే సర్పనాయకుడు తగిన వరుడిగా భావించి అతని పితామహుని అర్ధించడానికి ఆయన చెంతకు వెళ్ళి తన కోరికను వెల్లడించాడు. కాని, సుముఖుని తాతగారైన ఆర్యకుడు బాధతో గరుడుని వల్ల తన కుటుంబానికి వాటిల్లిన నష్టాన్ని వినిపించాడు మాతలికి. “నా కుమారుడు, సుముఖుని తండ్రి అయిన చికురుని - గరుత్మంతుడు క్రోధంతో వధించాడు. అంతేకాక సుముఖుని కూడా నెలరోజులు కాగానే వచ్చి చంపి తీసుకుపోతానని పంతం పట్టి వెళ్ళాడు. ఇటువంటి పరిస్థితిలో నా మనుమడికి నీ కుమార్తెనిచ్చి వివాహం ఎలా జరిపించగలను? అదీగాక గరుడుని బలపరాక్రమాలు నీవెరిగినవే కదా! నీ ప్రభువైన ఇంద్రునే గెల్చిన వీరాధి వీరుడి ముందు మేమెంత వారము? పైగా నాగజాతిని ఆహారంగా వరం వరం పొందిన మహనీయుడాయె! ఆయన తలచుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయగల సమర్థుడు. సుముఖుడు ఒక లెక్కా!” అని దుఃఖంతో గొంతు పూడుకుపోయిన ఆర్యకుని చూసి జాలిపడ్డాడు మాతలి.
"సర్పరాజా! బాధపడకు. నేను మహేంద్రునితో చెప్పి నీ మనుమడికి ఆయుస్సునిప్పిస్తాను. గరుడుడు ఇంద్రుని మాట కాదనడు. మీరిద్దరూ నాతో రండి. దేవేంద్రుని చెంతకు వెళ్ళి వరం కోరుకుందాం. ఉపేంద్రుడైన శ్రీమహావిష్ణువు కూడా ఇప్పుడు త్రిలోకాధిపతి చెంతనే ఉన్నాడు. వారు మనల్ని కరుణించకపోరు” అని చెఇప్ప ఆర్యకుని, సుముఖుని వెంటబెట్టుకుని ఇంద్రుని వద్దకు వెళ్ళాడు మాతలి. ఆర్యకుడు చెప్పినదంతా విష్ణు సమక్షంలో ఉన్న ఇంద్రునికి మనవి చేశాడు మాతలి. తన పుత్రికకు సుముఖుడే తగిన వరుడు కాబట్టి సుముఖుడికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించమని దేవేంద్రుని వినయ పూర్వకంగా కోరాడు. మాతలి మాటలు విన్న ఇంద్రుడు మొదట విష్ణుమూర్తికి విన్నవించి ఆతని అనుగ్రహాన్ని పొందుదామని అనుకొన్నాడు. అంతలో తానే సుముఖుడికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించగలవాడను గదా అనుకొని, గరుడుడు తన వరాన్ని ఉల్లంఘించడని భావించి, సుముఖుడికి దీర్ఘాయుష్మంతుడివి కమ్మని వరమిచ్చాడు. ఇంద్రుడిచ్చిన వరానికి మిగుల సంతోషించిన మాతలి తన కుమార్తెను సుముఖునికిచ్చి మంగళప్రదంగా వివాహం జరిపించాడు. ఆ విషయం వినతాసుతుడికి తెలిసింది. ఇంద్రుని కన్న ఘన పరాక్రమవంతుడనైన నన్నే ఇంద్రుడు తిరస్కరించి నాగులకు వరమిస్తాడా? అని కోపోద్రిక్తుడైనాడు గరుడుడు. వెంటనే వాయువేగంతో స్వర్గాధిపతిని చేరుకొన్నాడు. మహేంద్రుని పక్కనే కూర్చుని అతనితో ముచ్చటిస్తున్న మహావిష్ణువును చూశాడు. కాని గరుడుని దృష్టి ఇంద్రుడు చేసిన పరాభవం మీదనే ఉంది. ఎందుకిలా చేశావని ఇంద్రుని నిలదీద్దామనుకొన్నాడు. "మహేంద్రా! నీవు అదితి కొడుకువు. నేను వినత పుత్రుడను. బలంలో, పరాక్రమంలో, శక్తిలో మనల్ని మించినవారు లేరు. మన ఇద్దరికీ తండ్రి కశ్యపుడొక్కడే కదా! తల్లులు వేరైనా, వారిద్దరూ మళ్ళీ అక్క చెల్లెళ్ళే కదా! మనలో మనకు వేరు భావాలెందుకు? ఒకప్పుడు నీవు నాతో సఖ్యం చేశావు. మరచిపోయావా? నాగుల్ని నాకప్పగించి, మళ్ళీ నాగనాథుని రక్షించావు. ఇది న్యాయం కాదు కదా! అది అలా ఉంచు. మనిద్దరం ఏకోదరులం కాకపోయినా సహోదరులమే కదా! కనుక మన బలపరాక్రమాలతో - నీకు వైరులు, క్రూరులు అయిన రాక్షసులను వెదకి వెదకి సంహరిద్దాం. అదీ మనిద్దరి మధ్యా ఉండవలసిన మైత్రీ భావం. అంతేకానీ - , “ఇంద్రా! నీకంటే నేను దేనిలో తక్కువ? నిన్ను జయించిన వాడినే గదా! అటువంటిది - ఇప్పుడు నీవు నా ప్రయత్నానికి అడ్డు తగిలావు. ఎందుకు? నాతో మళ్ళీ యుద్ధం జేసి మరోసారి పరాజితుడివి కావాలని ఆశగా ఉందా? చెప్పు” అని గరుత్మంతుడు వీరావేశంతో పలకగానే ఇంద్రుడు చెంతనే ఉన్న విష్ణువు వైపు చూశాడు. చూసి - "వైనతేయా! నీవింత గొప్పవాడివని చెబుతున్నావే? ఒక్క మాట విను. మహత్తరమైన నీ ప్రభావానికి, శక్తికి ఎవరు కారణమనుకొన్నావు? అఖండమైన నీ బల పరాక్రమాలకు, శక్తి సామర్థ్యాలకు విష్ణుమూర్తి తప్ప వేరెవ్వరూ కారకులు కారు. నీవే ప్రతిభావంతుడివనుకుంటున్నావా? ఆ పరమాత్ముని కరుణా విశేషం చేతనే నీకింత మహత్తు కలిగినది. పక్షీంద్రుడివై నన్ను కూడా గెలవకలిగావు. ఇది తెలుసుకో” అని ఇంద్రుడనగానే గరుత్మంతుడు కోపంతో వివశుడైనాడు. ఎరుపెక్కిన కళ్ళతో ఇంద్రుని చూస్తూ తన బలాధిక్యాన్ని మరోసారి గుర్తు చేశాడు. “తమ్ముడా! సురపతీ! నా శక్తి సామర్థ్యాలెటువంటివో నిజం తెలుసుకోలేకపోయావు. నన్ను అల్పుగా భావించి ప్రవర్తించటమే కాకుండా మాట్లాడావు కూడా. నా సంగతి ఒక్క మాటలో చెబుతాను విను. ఒక చిన్న సన్నని ఈకమీద అదితీదేవికి జన్మించిన సర్వదేవతలను మోయగలిగిన బలసంపన్నుణ్ణి. అటువంటి బలాఢ్యుడనైన నన్ను ఈవిధంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతావా?” అని అహంకరించి పలుకుతున్న గరుడుని చూసి విష్ణుమూర్తి ఒక నవ్వు నవ్వాడు. పక్షీంద్రుని ఘనతను అతనికి తేటతెల్లమయ్యేటట్లు చేద్దామనుకొన్నాడు.
“ఓ వెర్రివాడా! గరుడా! నీవెంత గొప్ప బరువును మోయగలవాడివి? నా శక్తితో, నా ఉపాయంతో నిన్ను నడిపిస్తున్నానే! నీకెందుకీ గర్వం? నిజంగా నీవంత గొప్పవాడివా? అయితే దీనిని మొయ్యి. చూద్దాం నీ బలమెంతో! శక్తి ఎంతో!” అని అంటూ శ్రీమహావిష్ణువు తన ముంజేతిని గరుత్మంతుని వీపుమీద ఆనించాడు. అంతే. ఆ క్షణంలో - దేవేంద్రునే జయించానని విర్రవీగుతున్న పంద్రుడు తన వీపుమీద ఉన్న బరువును మోయలేక వికలుడైపోయాడు. చరాచర వస్తుజాలంతో నిండి ఉన్న భూవలయాన్ని అంతటినీ మోయగల గరుడుడు - పరమాత్ముని ముంజేతిని భరించలేక విలవిల్లాడిపోయాడు. నిమేషమాంతం కూడా నిలవలేకపోయాడు. భయభ్రాంతుడైనాడు. ఏమి జరిగిందో, ఏం జరుగుతున్నదో తెలుసుకోలేని అవస్థకు గురయ్యాడు.
విష్ణుమూర్తి ముంజేతినే మోయలేకపోయాడు గరుడుడు. ఆ పరమాత్ముని మొత్తం బరువును మోయగలడా? విష్ణువును తన మూపు మీద మోస్తున్నానని అనుకొన్నాడే గాని, ఆయన బరువును అతి తేలికగా చేసి కూర్చున్నాడని భావించలేకపోయాడు. ఆయన దయ వల్లనే తనకంత శక్తి కలిగిందని గ్రహించలేకపోయాడు. అంతకంతకు గరుడుని వీపు విష్ణుమూర్తి బరువును మోయలేక వ్యధకు గురవుతోంది. ఆ బాధకు తట్టుకోలేకపోయాడు పక్షీంద్రుడు. రెక్కలను సుదీర్ఘంగా చాచాడు. కాని జగన్నాథుని బరువు ఇంకా ఎక్కువైందా అనిపించింది గరుడుడికి. మోయలేక నోరు తెరిచాడు. ముక్కుపుటాలు మండిపోతున్నాయి. తన దేవుడు ఇంత బరువున్నాడా అనుకొన్నాడు క్షణం సేపు. నేను మోయలేకపోవటమేమిటని అనుకొనే లోపలే మూర్చిల్లాడు. స్పృహ లేని స్థితిలో క్రిందపడిపోయి వశం తప్పాడు. విపరీతమైన బాధతో ఆక్రోశించాడు. ఆ భక్తుని ఆక్రందన భగవంతుని కరుణాత్ముని చేసింది. “గరుడా! భయపడకు! నేనున్నాను గదా! నీకే భయం లేదు. ఏ నొప్పి కలుగదు” అని చెబుతూ పరమాత్ముడు - చిక్కుకుపోయిన గరుడుని ఈకలన్నిటినీ చక్కగా పేర్చి, తన చేతితో పైకెత్తి గరుడుని చక్కగా ఎగురగలిగేటట్లు చేశాడు. వాత్సల్యంతో భయం పోయే విధంగా అనునయించాడు. ప్రేమగా పలకరించాడు. గరుడుడికి యథాశక్తిని ప్రసాదించాడు. “గరుడా! నీ గర్వం ఉడిగింది కదా! భవిష్యత్తులో ఎప్పుడూ అహంకరించక ప్రవర్తించు. బుద్ధిమంతుడవై, వినయశీలివై, అహర్నిశలూ నా ముందు నిలిచి, నన్ను సేవించు. నా కరుణ నీమీద ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళిరా! అని విష్ణువు గరుడుని ఓదార్చి పంపివేశాడు. సుయోధనా! విన్నావు కదా! సమస్త భూ ప్రపంచాన్నే మోయగల, క్షణకాలంలో ముల్లోకాలూ చుట్టిరాగల అమేయ బల పరాక్రమాలు గల గరుడుడే గర్వించేసరికి నిర్వీర్యుడైపోయాడు. ఎంతటి బలవంతుడైనా అంతకంటే ఎక్కువ బలంగల వారెదురైతే క్రిందపడక తప్పదు. ధర్మప్రవర్తన ముందు అహంకారం క్షణమైనా నిలవలేదు. కనుక ఆదివిష్ణుడైన శ్రీకృష్ణుని సహాయమున్న పాండవులు ధర్మ ప్రవర్తకులు కావటం వల్ల వారినెన్నటికీ నీవు నిర్జించలేవు. గరుత్మంతుని కన్న నీవధిక బలసంపన్నుడవా? కాదే! అందుచేత ఎంతమాత్రంఅహంకరించక శ్రీకృష్ణుని వచనానుసారం పాండవుల రాజ్యభాగం వారికిచ్చి వారితో సఖ్యంగా మెలగడమే నీకు శ్రేయోదాయకం. మహరుల మాటలు తిరస్కరింపదగినవి కావు” అని కణ్వుడు చెప్పిన అనంతరం నారద మహర్షి సుయోధనుని చూసి, తన వాక్కులుగా ధర్మబోధ చేయసాగాడు. “కౌరవేశ్వరా! యుద్ధం చేసి పాండవులను హతమార్చి, నా రాజ్యాన్ని నిష్కంటకం చేస్తానని నీవు మొండిపట్టు పడితే - దానివల్ల ఆపదలు కలుగుతాయే తప్ప అధర్మవర్తనుడు ఎన్నటికీ విజయం సాధించలేడు. త్రిలోకాలూ తన గుప్పిటిలోనే ఉన్నాయని, తననెవరూ ఎదిరించి గెలువలేరని గర్వించిన గరుత్మంతుడు పరమాత్ముని బోధ చేత సాత్త్వికుడైనట్లే నీవు కూడా సద్బుద్ధితో మెలిగితే కురువంశమంతా శోభాయమానంగా ప్రకాశిస్తుంది. ఎంతటి ఘనులైనా మహర్షుల మన్ననలకు పాత్రులు కావాలే గాని వారి శాపాలకు గురి కాకూడదు. . జామదగ్న్యముని గాని, కణ్వమహర్షి గాని, నేనుగాని - నీ మేలుకోరే చెబుతాము. తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో నివసించే మునులు నన్నేం చేస్తారులే అని అహంకరించకు. దానికి కూడా నీకు గరుడుని చరిత్రే చెబుతాను. ఎంతటి విష్ణుభక్తుడైనా, బలశాలి అయినా గరుడుడు ఒక తరుణంలో మహర్షి శాపానికి , గురికాక తప్పలేదు. ఎలాగంటావో! చెబుతాను విను.
ఒకసారి గరుత్మంతుడున్న చోటికి అనుకోకుండా, దారిని బోతూ బాల్యమిత్రుడైన గాలవుడనే మునికుమారుడు వచ్చి, తన కష్టాన్నంతా చెప్పుకుని వ్యధ చెందాడు. “గాలవుడు విశ్వామిత్ర మహర్షికి శిష్యుడు. విద్యాభ్యాసమంతా పూర్తి అయిన తరువాత విశ్వామిత్రుని గురుదక్షిణగా ఏమి ఇచ్చి సంతోషపెట్టమంటారని వినయంగా అడిగాడు. విశ్వామిత్రుడు గురుదక్షిణ ఇమ్మని కోరలేదు. శిష్యుడు మరీ మరీ అడిగాడు ఏమిమ్మంటారని. గురువు ఎంత చెప్పినా వినక గురుదక్షిణ ఇచ్చి తీరుతానని నిర్బంధించడంతో విశ్వామిత్రుడికి ఇక తన కోరిక చెప్పక తప్పలేదు. ఇష్టం లేకపోయినా, శిష్యుని గురుదక్షిణ ఇమ్మని తన అంగీకారాన్ని తెల్పాడు. తెల్లని శరీరాన్ని కలిగి ఉండి, ఒక చెవిమాత్రం నలుపురంగుతో ప్రకాశించే ఎనిమిది వందల ఉత్తమాశ్వాలను తెచ్చి దక్షిణగా సమర్పించమని విశ్వామిత్రుడు చెప్పటంతో వెంటనే ఆ గుర్రాలను వెదకి తేవడానికి బయలుదేరి వెళ్ళి ఎక్కడా అటువంటి గుర్రాలను సంపాదించలేక గాలవుడు ఆత్మాహుతి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. గురు ఋణం తీర్చుకోలేక, అసత్య దోషానికి పాల్పడ్డానే అని ఆర్తితో తిరిగి తిరిగి చివరకు గరుడుని చేరుకొన్నాడు. గాలవుడు, గరుడుడు ఒకరినొకరు చూసుకుని ఆనందపరవశులైనారు. చిన్ననాటి విషయాలు ఎన్నో గుర్తు చేసుకొని నవ్వుకొన్నారు. గాలవుడి విషయమంతా విన్న గరుడుడు - అతనికి సహాయపడదామని అనుకొన్నాడు. తన దైవమైన విష్ణుమూర్తి చెప్పిన మాటలన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. గర్వోన్నతి పొందకుండా శాంతి సహనాలతో ఇతరులకు మేలు చేస్తే భగవంతుడానందిస్తాడని తెలుసుకొన్నాడు. “గాలవా! నీ బాధ నాకర్థమైంది. నీ కర్తవ్యం పూర్తి అయ్యేవరకు నీకు నేను సహాయుడిగా నీతోనే ఉంటాను.
మిత్రమా! దేవతలు తప్ప ఇంటి గొప్ప పనులు వేరేవారెవ్వరూ చేయలేరు. నీవు చెప్పిన ఉత్తమాశ్వాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ముందుగా దేవతలు నివసించే తూర్పుదిక్కువైపు వెళదాం. అక్కడా గుజ్రాలు దొరుకుతాయేమో ప్రయత్నిద్దాం” అని చెప్పి గాలవుని తన మూపుమీద కూర్చొన చేసి తూర్పుదిక్కుగా ప్రయాణించాడు. గరుడుడు. సముద్రం మీదుగా ఆకాశవీధిలో మనోవేగంతో గరుత్మంతుడు ఎగిరిపోతుండగా, ఆ ధాటికి ఆగలేక గాలవుడు మూర్చ వచ్చినంత పనై మూపుమీద పక్కకు ఒరిగాడు. గాలవుని స్థితి చూసి గరుడుడు వెంటనే దగ్గరలో ఉన్న ఒక కొండపైన దించి, సేద తీర్చాడు. గరుడుడు కొండ మీదకు దిగుతున్న సందర్భంలో ఆ ప్రదేశంలోనే తపస్సు చేసుకొంటున్న 'శాండిలి' అనే మహర్షికి తపోభంగం జరిగింది. ఆ తపోధనుడు కళ్ళు తెరిచి క్రోధంగా చూడడంతో గరుడుడి బలం కొంత తగ్గింది. గరుడుని ఉద్దతిని చూసి “నాకు తపోభంగం చేశావు కనుక, ఏ రెక్కల వల్ల నీవలా చేయగలిగావో - ఆ రెక్కలు రాలిపోవు గాక!” అని శాండిలి శపించేసరికి గరుడుడు మహర్షి తపశ్శక్తికి ఆశ్చర్యంతో పాటు భయపడ్డాడు. రాలి క్రింద పడిన రెక్కలు చూసి బాధతో గరుడుడు మునిని శరణు కోరాడు. శాపానుగ్రహ సమర్థుడైన శాండిలి మహర్షి మరల గరుడుడికి రెక్కల ననుగ్రహించడంతో మొలిచిన రెక్కలను చూసి పరమానందభరితుడై, ఆ మహాత్మునికి నమస్కరించి, తూర్పు దిక్కుకు ప్రయాణాన్ని కొనసాగించకుండా గాలవుని భూమిమీద దించి క్షణం ఆలోచించాడు గరుడుడు. తనకు ప్రియమిత్రుడైన యయాతి వద్దకు గాలవుని తీసుకొని వెళ్ళి అశ్వరాజాలు దొరికే ఏర్పాటు చేయమని కోరాడు. యయాతి సహాయంతో - ఇక్ష్వాకుడు, దివోదాసుడు, ఔసీనరుడు అనే రాజులు ఒక్కొక్కరు రెండు వందల చొప్పున ఆరు వందల ఉత్తమాశ్వాలను ఇవ్వడంతో ఇంకా రెండు వందల అశ్వాలను ఎలా సంపాదించడమా అని బాధపడుతున్న గాలవుని చూసి ఓదార్చి గరుడుడతనికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. పాండవులను (సశేషం)