శ్రీవేంకటేశం లక్ష్యం
శ్రీ శార్వరి నామ సంవత్సరంలో, 15వ వసంతంలోని మొదటి సంచిక, ఈనాటి శ్రీవేంకటేశం పత్రిక. తిరుమల శ్రీవేంకటేశ్వరుని కృప అందరికీ లభించి, లోకమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పొందిన ఈ మానవజన్మ ఆయన కృపచే సఫలీకృతం కావాలనే ఆకాంక్షే ఈ పత్రిక ముఖ్యోద్దేశము. 'ఏప్రిల్' మరియు 'మే' నెలలో కరోనా మహమ్మఆరి దృష్ట్యా ఈ పత్రికను ప్రచురించనందులకు చింతించుచున్నాము.
పూర్వం నుండి నేటివరకు ఎంతోమంది రాజులు, రాజ్యాలు అంతరించిపోయాయి. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిక్షణం లోకంలో మార్పు జరుగుచూనే ఉన్నది. పాత జీవులు మరణించుట, కొత్త జీవులు పుట్టుట, మళ్ళీ మరణించుట ఇలా మన కళ్ళముందే లక్షలాది మంది మరణించుచూ ఉన్నారు. పుడుచున్నారు. నాకంటే గొప్పవారు లేరన్న రాజులు మరణించారు. ఒకప్పటి కోటలు, భవంతులు, రాజ్యాలు అన్నీ పాడుపడిపోయాయి. ప్రస్తుతం వాటిలో కొన్ని కుక్కలకు, పందులకు నిలయంగా మారాయి. ఈనాటి పరిస్థితులు కనుక ఆనాటి రాజులు చూచి ఉంటే వాటిని సాధించటానికి వారు పడిన శ్రమ, చేసిన యుద్ధాలు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరయ్యాయని, చాలా పెద్ద తప్పు చేశామనీ తప్పక కనువిప్పు కలగగలదు. సహజంగా మనిషి చాలా తెలివైనవాడు. మోక్ష జ్ఞాని, కాని కాలము యొక్క గత చరిత్రను తెలుసుకున్నప్పటికీ, మన కళ్ళముందు మనుషులు మరిణించుచున్నప్పటికీ, తనకు మాత్రము చావు ఉండదని, చిరకాలము బ్రదుకుదునని భావించి తన జీవితములోని అతి ముఖ్యమైన సమయమును ధన సంపాదనకై, పరపతి పెంపొందించుకొనుటకై అవసరమైతే చెడు మార్గాలను సహితము అవలంబించి తన మనస్సుకు నచ్చినటుల ప్రవర్తించుచున్నాడు. సన్మార్గమున ప్రయాణించమని చెప్పేవారిని ఛీ కొడుతున్నాడు. తానే కాకుండా తన సంతానమును సహితము అదే మార్గములో పయనించుటకే ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుచున్నది? ఏ శక్తి మనలను చెడువైపు త్రిప్పుచున్నది? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వానివలె అరిషడ్వర్గాలైన కామక్రోధ మోహ మద మాత్సర్యాలకు బానిసై, అహంకారముతో నేను, నాది, నావారనే తలంపుతో చెడును అవలంబించుచున్నాము. పొందిన ఈ మానవజన్మను వ్యర్థపరచుచున్నాము. ఏదో ఒక శక్తి మనలను ఈ తప్పడు దారి వెంట పయనించుటకు ప్రేరేపించుచున్నదనుట నిర్వివాదాంశము. ఆ చెడు శక్తిని ఎదిరించి నిలిచే శక్తి మనలో లేదు కాబట్టి మనం వ్యసనపరులమవుతున్నాము. ఈ శక్తిని పొంది, మానవజన్మను పొందిన ఉద్దేశాన్ని పూర్తి కావించాలంటే తిరుమల శ్రీవేంకటేశ్వరుడి నామస్మరణ ఒక్కటే మార్గము. ఆయన కృపను పొందుటయే మనము చేయదగిన ప్రయత్నము. స్మరణ మాత్రముననే మనను కరుణించే దయామయుడు ఆ స్వామి. నిజానికి ప్రతి మనిషీ ఏకాకి. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న తల్లితండ్రులు, భార్యాబిడ్డలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మనవారు కారు. సమయము వచ్చినప్పుడు ఎవరికి వారు వెళ్ళిపోగలరు. మనకు ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మల తోడుండువాడు, తల్లి, తండ్రి, దైవము, గురువు, మిత్రుడు, బంధువు ప్రతీదీ ఆయనే. కాబట్టి ప్రతివ్యక్తి ఈ జన్మలో శ్రీవేంకటేశ్వరుని నామస్మరణ సర్వదా కావించాలని, ఆయన కథలను, గడిచిన అవతరాలను, వాటి ఉద్దేశ్యాలను తెలుసుకుని, శ్రీవేంకటేశ్వరుడే నా దైవము, నావాడనే దృఢ సంకల్పానికి రావాలనే ముఖ్య ఉద్దేశ్యమే శ్రీవేంకటేశం యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే లక్ష్యాన్ని నెరవేర్చుకునే శక్తిని ప్రసాదించమని శ్రీవేంకటేశం పాఠకులందరికీ శ్రీవారి ఆశీస్సులు లభించాలని మా ప్రభు తిరుమల శ్రీవేంకటేశ్వరునికి శతకోటి ప్రణామాలు అర్పించుచున్నాము. శ్రీవారి భక్తులమైన మనము నేటి ఈ కరోనా పరిస్థితిని, ఆయన సాధనకై ఒక గొప్ప వరంగా మార్చుకుందాం!
శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు : పుల్లగూర్ణ సాయిరెడ్డి (గ్రోవింద దాను)