ధర్మ సంస్థాపనార్థం భగవానుడు శ్రీమన్నరాయణుడు ఆయా కాలాలలో ఆయా విపత్కర పరిస్థితులలో ఈ పుడమిపై జన్మించి కల్లోలిత, అశాంతియుత, హింసాయుత, దుర్మార్గ చేష్టలను, లోకకంటకులను సంహరించి భువిపై సుఖశాంతులు, ఆనందోత్సాహాలు ప్రసాదించెను. ఆ లీలామానుష వేషధారి అవతారాలు ఏవి అయినా వేర్వేరు కారణాలతో దేవతా రహస్య సంబంధాలతో కూడి, లోక కళ్యాణార్థము ప్రభవించినవే.
అట్టి అవతారాలలో శ్రీ కృష్ణావతారమొకటి. పురాణ పురుషుడు, ధర్మరక్షకుడు, యోగిపుంగవుడు, ధీరుడు, శూరుడు, సంకల్పసిద్దుడు, దుష్టసంహారి, ప్రియ భక్తుల సులభుడు, వరదుడు, నీవే తప్ప మరొకరు నాకు లేరన్న, ఆదుకొనే జనరక్షకుడు. నందనందనుడు దేవకీపుత్రుడు, గురువు, బంధువు, సఖుడు, ఆప్తుడు, మార్గదర్శి, ప్రియుడు, సంకటహరణుడు, గోపీలోల గోకుల రక్షకుడువ్రే పల్లెవాసుడు శ్రీ కృష్ణుడు దేవతలు, మునులు, రుషులు, సాధువులు, స్త్రీలు, పిల్లలు మొదలగువారు లోకంలో పుట్టిన పలువురు దైత్యులను వారి పరాక్రమములను ఎదిరించలేక అనేక కష్టాలపాలై అశాంతితో హృదయములు తల్లడిల్లంగ, రాక్షసులు పెట్టు బాధలు తట్టుకొనలేక రాక్షసారి యగశ్రీ మన్నారాయణుని వేడుకొనిరి. రాక్షస సంహారార్థం నారాయణుడు దేవకీ వసుదేవుల గర్భమున శ్రీ కృష్ణపరమాత్మునిగా జన్మించెను. దేవకీ వసుదేవులు గతజన్మలో అదితి కశ్యపులు. వారి పూర్వజన్మ వృత్తాంతం ప్రకారం వారికిశ్రీ మహావిష్ణువు సంతానముగా పుట్టెదనని వాగ్దానము చేసెను. స్వాయంభువ మన్వంతరమున దేవకి పృశ్ని అను పరమ సాధ్వి. వసుదేవుడు “సుతపుడు” అను ప్రజాపతి. సృష్ట్యాది యందు వారిరువురు బ్రహ్మదేవుని ఆదేశానుసారం పూర్తిగా జితేంద్రియులై పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసిరి. ఘోరమగు వారి తపస్సుకు మెచ్చి, వరం కోరుమనగా వారు విష్ణుమాయలో పడి దుర్లభమగు ముక్తిని కోరక సంతానము కావాలని కోరిరి. వారి కోర్కెల ప్రకారం మూడు జన్మలలో దంపతులకు కుమారుడిగా జన్మించెను. మొదట జన్మలో పృశ్ని గర్భుడు. రెండవది వామనుడు. మూడవశ్రీ కృష్ణుడుగ అవతరించెను. విరాట్ స్వరూపుడగు శ్రీ హరి దేవతలను యాదవ సమూహముగను, ఆదిశేషుడు బలరాముడుగను, దేవకీ సుతుడిగ నేను జన్మించెదనని వివరించెను. తన మాయను రేపల్లెలోని నందునింట యశోదాదేవి గర్భాన ఆడుబిడ్డ రూపమున జన్మించు ప్రణాళికను రచించెను. ఆ సమయాన భూలోకంలో ఎందరో రాక్షసులు వివిధ క్షత్రియ కులాలలో పుట్టి పరిపాలకులై నిరంకుశ ప్రభువులుగా చలామణీ అగుచుండిరి. మధురను పాలించు మహారాజు ఉగ్రసేనుడు. అతనికి కంసుడు, దేవకి అను సంతానము కలరు. దేవకీదేవిని వసుదేవుడు వివాహమాడెను. వసుదేవునికి అష్ట భార్యలు కలరు. ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత,శ్రీ దేవి, శాంతిదేవి, సహదేవి, దేవకీదేవి, రోహిణి. వీరిలో మొదటి ఏడుగురు కంసుని చెరసాలలో బంధించబడిరి. అశరీరవాణి వార్త విని కంసుడు తన బావను చెల్లెలినిద్దరినీ ఖైదీలుగా బంధించెను. ఉగ్రసేనుడు స్వతహాగా సాధుజీవి. సద్వర్తనుడు. శాంతస్వభావుడు. కాని కంసుడు పరిపాలనా సమయానికి అతడు వయోవృద్ధుడు. ఫలితంగా కొడుకుమాట జవదాటలేని అశక్తత - అయినను ఎదిరించి పరాజయుడై ముసలివాడై నోరు నొక్కకుని మూలన కూర్చుండెను. కంసుడు కాలనేమి ప్రభావమున జన్మించిన రాక్షస రూపుడు. రోహిణి వసుదేవుని మిత్రుడు. నందునివద్ద రహస్యంగా జీవించుచుండెను. ఆమె గర్భం నుంచి బలరాముడు జన్మించెను. - అష్టమ గర్భమున దేవకి నోముల పంటగా శ్రావణ మాసాన శుక్లపఓ అష్టమినాడు చెరసాలలో శ్రీ కృష్ణుడు జన్మించెను.
ఆ పసిబిడ్డను మాయావిశేషముతో, వసుదేవుడు చొరవతో రేపల్లెలోని నందునింట ఉంచెను. యశోదాదేవి పెంపుడు కొమారుడిగా శ్రీ కృష్ణుడు పెరిగెను. ప్రతి తెలుగువారింట పసిపిల్లల ఆటపాటలు, అల్లర్లు, విందులు, వినోదాలు జరిగినట్లుగ కృష్ణుడి బాల్యము గడిచెను. కంసుని పిలుపుపై శ్రీ కృష్ణ బలరాములు మధురకు అక్రూరుని ద్వారా రప్పించబడిరి.
శ్రీ కృష్ణ లీలలు:
అల్లరి కృష్ణుడై రేపల్లెను అలరించెను. గోపస్త్రీల ఇంట పాలు పెరుగులు దొంగిలించి వారికి వీరికి తగవులు పెట్టి వినోదం సెడివాడు. ఆతని క్రీడల వలన కొందరు మనస్తాపులై తల్లికి ఫిర్యాదులు చేసెడివారు.
అని వారు కృష్ణుడి ఆగడాలు వివరిస్తుంటే - ముద్దు మురిపాలతో తన బిడ్డ వీపు నిమురుతూ, అమ్మలారా! మావాడు అమాయకుడు, నన్ను విడిచి బయటకు వెళ్ళడు. కళ్ళు సరిగా తెరవని ఈ చిన్ని బుడతడిపై మీరు అనవసరంగా నిందలు వేస్తున్నారు.
అని ఎటులనో నచ్చ చెప్పి వారినిళ్ళకు పంపివేసెడిది. మరింత అమాయకుడిలా నటిస్తూ తల్లి ఎదుట ఏమాత్రమెరుగనని మన్నించమని కోరెడివాడు. మరొకసారి స్నేహితులు మీ అబ్బాయిగుప్పెడుగుప్పెడు మట్టి తింటున్నాడని పితూరి చెప్పెను. అంతట యశోద చిరుకోపంతో కుమారుడి చెవి నులిమి నోరు తెరవమని కోరెను. యని నోరు తెరిచెను. ఆ బాలుని ముఖమునందు అద్భుత సృష్టి రహస్యములు యశోద గాంచెను - అంతట ఆమె దిగ్భాంతికి గురై
మామూలు పిల్లవాడైతే ప్రపంచమంతా ఈతని నోట్లో కన్పించడమేమిటి? సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, దైత్యహంతకారి శ్రీ మహావిష్ణవేమో! ఈతని ముఖస్థ భాగమున నేను, నా భర్త, గోవులు,కనబడుచున్నాము. ఈతడు ఈశ్వరుడే నని భావించెను. తదుపరి ఆ మాయ విష్ణుమాయగ మిగిలెను. తిరిగి యశోద మామూలు తల్లిగ మారెను. ఆ అద్భుత విషయం మరచెను. - భాగవతమును సంస్కృతములో వేదవ్యాసుడు రచించినా, తెలుగువారి అదృష్టవశాత్తునో లేక ఏ పూర్వ పుణ్యఫలము వలననో మహాకవి పోతన ప్రణీతమగు ఆంధ్ర మహాభాగవతము ద్వాదశ స్కంధములతో రచింపబడెను. దశమస్కంధమునందు శ్రీ కృష్ణావతారము - లీలలు, పలు విశేషములు పొందుపరచబడినాయి. ఈ స్కంధమున భాగవత మహిమనువివరించబడెను.
చెప్పకనే కవి ఉద్బోధించెను. లోకరక్షకుడు, ఆర్తజన పాలకుడు, సర్వసమర్థుడు, దానవుల సంహారి, శాంతి సమాజ స్థాపకుడిగా నుతియించెను. ఇందుశ్రీ కృష్ణలీలలు కల్పవృక్ష తరువునకు కుదురు (మూలము) వంటివి. శిశువుగా ఆతడు చేసిన లీలలు అర్థము అంతరార్థము గల్గినవి. లోక కంటకులను అవలీలగ మట్టుపెట్టెను. బాల (శిశు) హంతకులగు పూతన, తృణావర్తుడు, బకాసుర, అఘాసురుడు, ధేనుకాసురుడు, వృషభాసురుడు, కాళీయుడు, ఉలూఖ బంధనం, మద్దిచెట్ల విమోచనం, గోవర్ధన పర్వతమెత్తుట, వంటి ఘట్టాలు అద్భతాలు. అనిర్వచనీయాలు. చేయి తిరిగిన చిత్రకారుడి చిత్రముల వలె కనుల ముందు ఆవిష్కరింపబడు దృశ్యములు అవి.
యని గోపికలు శ్రీ కృష్ణుని పరాక్రమమును నుతియించిరి. నందుని కులగురువు గరుడు. గరుడు కృష్ణుని దేవతాంశమును గుర్తించి, భగవత్ స్వరూపంగా నమ్మి, కృష్ణుడు మీరనుకొనే సాధారణ బాలుడు గాదు. నారాయణాంశ సంభూతుడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం జన్మించిన దివ్యపురుషుడు. జగీశ్వరుడు. భగవంతుడు. వాసుదేవుడు. గోవులను, గోపల్లె జనాలను కాపాడిన గోవర్ధనగిరిధారి, గోవిందుడు. ఆ ఘన యమునా తటిలో గోపికల మానసమును దోచిన దొర. తరువాత కాలమున రేపల్లె వీడి మధురానగరి చేరి కంసుని సంహరించెను. తిరిగి రేపల్లెకు మళ్ళీ రాలేదు. ఆతని వివరములు మిత్రులు, బంధువు ఉద్దవుడి ద్వారా తెలుసుకొంటారు. తొలిసారిగా శ్రీ కృష్ణుడు భగవానుడని గుర్తెరిగినవారు ముగ్గురే ముగ్గురు. వారిలో వ్యాసుడు, భీష్ముడు, ఉద్దవుడు ప్రముఖులు. లీలలు బట్టి దేవదేవుడని నమ్మినవారు ధర్మరాజు, కుంతి, విదురుడు, సంజయుడు, ద్రౌపది, గరుడు, సాందీపుడు, యశోద, అక్రూరుడు, కుచేలుడు, అర్జునుడు మొదలైనవారు. ఇది పరిపూర్ణావతారము.కంసుని సంహారానంతరం వృష్టివంశము, యదుకులము అభివృద్ధికై తనవారికోసం ద్వారకా పట్టణం నిర్మించి వారి వంశోన్నతికి పాటుపడెను. గీతాచార్యుడిగ, పలువురి దైత్యులను సంహరించినవాడిగ, యజ్ఞపురుషుడిగ, వేదస్వరూపునిగ, సశంఖ చక్ర ధారిగ స్తుతించబడెను. అష్టభార్యలు కలిగి వేలాది సంతానము కలిగిన వాడు.
శ్రీ కృష్ణుని జీవిత విశేషాలు, ఆతని చరిత్ర, లీలలు, శ్రీ మద్బాగవతము, బ్రహ్మవైవర్తపురాణం, గర్గసంహిత, మహాభారతము, హరివంశము, దేవీ భాగవతం, బ్రాహ్మణ సంహిత, విష్ణుపురాణము, శ్రీ కృష్ణ కర్ణామృతము, గీతగోవిందము, శ్రీ కృష్ణ లీలాతరంగిణి, ముకుందమాల, రాధాసుధానిధి, క్షేత్రయ్య పదాలు, రాధికా లహరి మొదలైన ఇతర గ్రంథాలలో మనకు అవగతమవగలదు. 'రాధ' అనే ప్రియురాలి గురించి భాగవతము, హరివంశం మహాభారతంలో కనిపించదు. దేవీ భాగవతం, గీతగోవిందంలో రాధికా ప్రసాద్ మహరాజ్ రచనలలో కనిపించదు.