అని ఆదిపరాశక్తి జగన్మాతనశ్రీ మహావిష్ణువు సంస్తుతిస్తాడు. “అమ్మా! సకల విశ్వాలు నీయందే పుట్టి, నీవలననే పాలించబడి, నీయందే లయమవుతున్నాయని నేను తెల్సుకొంటిని. ఈ మూడు కార్యాలను నిర్వహించే ప్రభావం నీ శక్తికే కలదనియునేనెరిగితిని. నీవు సకల లోకమయివి. సకల జీవుల చైతన్యశక్తివి. పండితులలో పాండిత్యరూపమైన విద్య, మానవులలో శక్తివి, విజ్ఞానమూర్తివి, ముక్తిప్రదవు. వేదమయివి, నాదమయివి,
మంత్రమయివి, ప్రకృతిమయివి. మూడు మూర్తులకు, మూడు శక్తులకు, మూడు లోకాలకు మూలమైన అక్షర పరబ్రహ్మ దివ్యశక్తివి. నీకు నమస్కారములు" అంటూ సుదీర్ఘంగా సంస్తుతించడం విశేషం. అమ్మ అవతారాలు, ఆకృతులు అనంతాలు. అమ్మ లీలలు, హేలలు అనిర్వచనీయాలు. విశ్వరక్షణ, జీవ సంరక్షణకై అమ్మ చేసే వింతలు, వినోదాలు అద్భుతాలు. అమ్మ అర్చనలు, ఆరాధనలు, ఉపాసనలు, మంత్ర జపాలు, ఆధ్యాత్మిక తపాలు, బీజాక్షర యుక్తమైన నామ మంత్ర పఠనాలు మహాశక్తివంతం. మహిత శుభ ఫలప్రదం. అమ్మ సన్నిధి బిడ్డలకు పెన్నిధి. నమ్మి కొలిచినవారికి నారాయణీ మాత కొంగు బంగారం. భక్తితో భజించినవారికి బలం, ఫలం ప్రసాదించే తత్త్వం అమ్మది. మూడుడైన, అక్షరజ్ఞానం లేని గొట్టెల కాపరిని కాళిదాసును, కవికుల తిలకునిగ చేసిన తల్లి జగన్మాతయే. సంగీత సాహిత్య సమలంకృత శ్యామలాదేవి. నవరాత్రి ఉత్సవాలలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రిగా నవదుర్గ రూపాలలో దర్శనమిచ్చి భక్తులను తరింపచేస్తోంది. ప్రత్యేకించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మశ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గ శ్రీ బాలాత్రిపురసుందరి శ్రీ గాయత్రి శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ లలితాత్రిపురసుందరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దినీ రూపంశ్రీ రాజరాజేశ్వరిగా అలంకరించబడడం విశేషం. ప్రతి అలంకారానికి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తానికి అమ్మ అనుగ్రహంకై ఆబాల వృద్దులు పరితపించడం, ప్రార్థించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మనం మూకశంకరేంద్ర సరస్వతీ స్వామివారిని గూర్చి తెలుసుకోవాలి. కామాక్షీమాత దివ్యానుగ్రహంతో మూగవాడైన మూకశంకరులు మాటలు వచ్చి మహాకవియై ఆశువుగా 500 శ్లోకాలను అమ్మవారిపై అనర్గళంగా చెప్పి “మూక పంచశతి” అనే స్తుతి కావ్యానికి తెరదీసిన యోగీశ్వరుడు. కంచికామకోటి పీఠానికి 20వ పీఠాధిపతిగా పనిచేసి, అమ్మవారి దంత పంక్తిలో ఐక్యత నందిన దివ్యపురుషుడు మూకశంకరులు. ,
మనకున్న శక్తిపీఠాలలో ప్రసిద్ధమైంది. కాంచీపురం. ఇక్కడ శక్తిపీఠం ఇతర శక్తిపీఠాలకు శక్తి, దీప్తి, స్పూర్తులను సదా అందిస్తోందని ప్రతీతి. కాంచీపురం మోక్షపురిగా ప్రసిద్ది. జగద్గురువు ఆదిశంకరులు సర్వజ్ఞ పీఠం స్థాపించారు. ఇక్కడున్న మహాశక్తి, అమ్మవారు కామాక్షీ మాత. స్వామి కామేశ్వరుడు. ఏప్రే శ్వరుడనియు అంటారు. కామేశ్వరునే కనులలో దాచుకున్న తల్లి కామాక్షి. సకల కామితాలకు సాక్షియై అనుగ్రహించే తల్లి కామాక్షి. త్రిమూర్తులే త్రినయనాలుగా కల్గిన తల్లి కామాక్షీ మాత అనియును అంటారు. కామునకు పునర్జన్మనిచ్చి, అనంగునిగా మార్చి, రతీదేవికి సంతృప్తిని కల్గించిన తల్లి కామాక్షి అనియు పండితులు విభిన్నంగా సెలవిస్తున్నారు. ఆ కామకోటి పీఠానికి గురుపరంపరలో 20వ మహర్షి మూకశంకర సరస్వతీస్వామిశ్రీ విద్యా మాతకు ప్రతిరూపులు. పుంభావ వాగ్గేవీ మాత. క్రీ.శ. 398 నుండి క్రీ.శ 437 వరకు 39 సం||లు కంచిపీఠమును నిర్వహించిన మహాయోగి మూకశంకరులు.
ఖగోళ శాస్త్ర పండితులైన శ్రీ విద్యాపతికి జన్మించినవారు మూకశంకరులు. పుట్టుకతో మూగతనం, చెవుడు ఉన్నాయి. అయినా ఆదినుండి అమ్మవారి ధ్యానంతో పెరిగాడు. ఒకమారు తన మిత్రునితో కంచికి పోయి, అమ్మవారి ఎదుట ధ్యానంలో మూకశంకరులు నిమగ్నమైనారు. ఇంతలో కాంచీపుర పీఠ శిఖాధిరూఢయైన ఆదిమశక్తి కామాక్షీమాత సామాన్యకాంతగా, పండు ముత్తైదువగా ఆలయంలోనికి వచ్చి మూకశంకరులను సమీపించింది. తాను నములుతున్న తాంబూలం ఎంగిలి పిడచను నోటినుండి తీసి ఎదురుగా ఉన్న శంకరుల మిత్రునకివ్వబోయింది. అమ్మవారిని గుర్తించలేని ఆ సాధకుడు, ఆ ముత్తైదువ ఎంగిలిని తిరస్కరించాడు. అప్పుడు ఆ తల్లి ప్రక్కన ఉన్న మూకశంకరులకిచ్చింది. మూకశంకరులు భక్తితో తీసుకుని, కళ్ళకద్దుకుని, ఎదురుగా ఉన్న అమ్మకు, పండు ముత్తైదువకు నమస్కరించి నోటిలో వేసుకొని నమిలినాడు. అంతే శంకరుల మూగతనం మాయమైంది. మాటల ప్రవాహం పెల్లుబికి వచ్చాయి. కనులు వర్తించాయి. ఒళ్ళు పులకరించింది. భావావేశం, సాహిత్యాభినివేశం, భక్త్యార్థతలు సమ్మిళితమై అతని నోట ఆశువుగా ఛందోబద్దమైన శ్లోకాల జలపాతం ప్రారంభమైంది. 500 శ్లోకాలు ఆలపిస్తే గాని మూకశంకరుల భావావేశం శాంతించలేదు. ఇంతలో అమ్మ “నాయనా! ఏమైనా వరం కోరుకో. అనుగ్రహిస్తా”నంది. అప్పుడు మూకశంకరులు “అమ్మా! నీ నామ మహిమ, నీ పాద మహిమ, నీ కటాక్ష వైభవం, నీ మందస్మితం, నీ దివ్యత్వంలను సంస్తుతించిన నోటితో లౌకికాలు మాట్లాడలేను. కనుక అమ్మా! తిరిగి నాకు మూగతనాన్ని అనుగ్రహించు”మని కోరినాడు. అమ్మ “తథాస్తు" అంది. పారలౌకికం మాత్రమే కోరిన భక్తుడు మూకశంకరులు. అమ్మ మణిద్వీపవాసిని. అక్కడ మహాయోగులకు ప్రత్యేకించి జ్ఞానమండపం ఉంది. అదే అమ్మ పరమపదం. మూకశంకరుల ఆత్మ బహుశః ఆ పరమ పదాన్ని కోరియుండవచ్చు. ఏదైనా అమ్మ అనుగ్రహం. అర్హతే అన్నీ నిర్ణయిస్తుంది కదా! - ఇది తెలిసి కంచిపీఠం స్వావిశ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి మూకశంకరులను పిలిపించి, ఆయన తల్లితండ్రుల అనుమతితో సన్యాసదీక్ష, ఉత్తరాధికారిగా చేయడం, అనంతరం మూకశంకరులు కంచిపీఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అమ్మ అనుగ్రహ విశేషం అలాంటిది. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్యామశాస్త్రి గారు కూడా సదా అమ్మ ధ్యాన మననాదులతో కామాక్షిని సేవించి తరించారు. కామాక్షీ మాతపైన, మధుర మీనాక్షీ మాతపైన కీర్తనలను వెలయించారు. శ్రీ విద్యను అర్హతను బట్టి సాధకులకు నేర్పించారు.
కంచిలో 1.కంచి కామాక్షి 2.తపోకామాక్షి 3.ఉత్సవ కామాక్షి 4.విమానకామాక్షి 5.బంగారు కామాక్షి అనే 5రూపాలలో అమ్మ దర్శనమిస్తుంది. శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షీ మాతను గానం చేసి “కామాక్షీ” అని గురువులతో పిలిపించుకున్నారు. కృతయుగంలో దూర్వాసుడుతే తాయుగంలో పరశురాముడు, ద్వాపరయుగంలో ధౌమ్యుడు, కలియుగంలో మూకశంకరులు కంచి కామాక్షీ మాతను కీర్తించి సేవించారు. నిజానికి భండాసురుని సంహరించిన బాలాత్రిపుర సుందరియే, లలితాత్రిపురసుందరియే కంచికామాక్షిగా కొలువు తీరిందని విజ్ఞుల భావన.
“అమ్మా! కామాక్షీ మాతా! నీవు రతీదేవి కోరికపై మన్మథుణ్ని పునర్జీవితుణ్ణి చేశావు. శశిశేఖరుడైన మహాదేవునికి సమ్మోహాన్ని కల్గించావు. భువిలోని మానవ సమాజానికి రాగద్వేషాలను స్తంభింప చేస్తున్నావు. వీనికి నీవు అందించే మందు ఒక్కటే నీ మధురమైన వీక్షణ కళ అనే ఔషధం”. అమ్మవారే “హిమగిరిసుత” చల్లనైన, తెల్లనైన గిరిసుత. దానికితోడు మంచితనం, మధురం, మహిమాన్వితమైన వీక్షణ కలాపం. శృంగారం మూర్తీభవించిన సౌందర్యలహరి అమ్మ. శాంతం ఆకృతి వహించిన శివానంద లహరియే అమ్మ. కరుణను చిలికే కాత్యాయనీ మాత అమ్మ. ఆకలియైన వారికి అన్నపూర్ణ. ఆర్తినందేవారికి అభయప్రదాయిని అమ్మ. అలజడికి అశాంతికి శివాని అమ్మ. అసురగణాలకు ఆదిశక్తి అమ్మ. ఆరోగ్యం , ఆయుషు, అక్షరం కాదనక ఇచ్చే సచ్చిదానంద స్వరూపిణి అమ్మ. అందుకే అమ్మను సదా పూజించాలి. ధ్యానించాలి.
పరాశక్తి పూజలకు అనువైన శుభసమయం ఆశ్వయుజ మాసం. శుక్లపాడ్యమి నుండి నవమి వరకు వ్రతపూజలు. దశమి నాగశ్రీ రాజరాజేశ్వరీ మాతను పూజించి ధన్యతను పొందడం. విద్య లేనివారికి విద్యలు, సంతు లేనివారికి సంతాన భాగ్యం, రోగులకు రోగ నివారణ, ఆరోగ్యం, కష్టజీవులకు, కర్మవీరులకు మంచి శుభ ఫలితాలను పొందే దినాలు నవరాత్రులు. “ఓం ఇహ్రా ం క్లీం చాముండాయై విచ్చే” అనేది అమ్మవారి నవాక్షర దివ్యమంత్రం. శక్తివంతమైంది. బీజాక్షర యుక్తమై అలరారుతోంది. అమ్మను దర్శించి ఈ నవాక్షర మంత్ర జపంతో పునీతులమవుదాం.