జాంబవతీ సమేత కృష్ణ ఆలయం
December 16, 2019 • Pullagurla Sai Reddy

జాంబవతీ సమేత కృష్ణ ఆలయం                                                            శ్రీ మతి టి.లక్ష్మి

నెలూరుజిల్లాలో సూళ్ళూరుపేట నుండి 3 కి.మీ దూరంలో ఉన్న మన్నారు పోలూరు అనేచోట ఒకే ప్రాంగణంలో రామ కృష్ణుల ఆలయాలు, మరో అద్భుత ఆలయం ఉన్నాయి. ఇక్కడ 9 అడుగుల భారీ గరుత్మంతుని విగ్రహం, తొమ్మిదిన్న అడుగుల జాంబవంతుని విగ్రహం, సుగ్రీవ, జటాయువు విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ వైష్ణవులకు అతి ప్రముఖ ఆలయం అళగిరి మల్లారి కృష్ణస్వామి ఆలయంలో ఉన్నాయి. 108 విష్ణు క్షేత్రాలలో కృష్ణస్వామి ఆలయం ఒకటి. బ్రహ్మాండ పురాణంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది. 10 వ శతాబ్దపు ప్రాచీన ఆలయం ఇది. - శమంతకమణి విషయమై నీలాపనిందలు పొందిన శ్రీ కృష్ణుడు, జాంబవంతుల మధ్య యుద్ధం జరిగిన విషయమంతా వినాయక వ్రతకల్ప కథలో అందరు చదివి ఉన్నదే. ఆ యుద్ధమే మల్లహరి పోరు అనే పేరుతో ప్రసిద్ధమైనది. అదే కాలక్రమంలో మాన్నారు పోలూరుగా మారిందని అంటారు. యుద్ధంలో జాంబవంతుని ఓడించిన శ్రీ కృష్ణుడు శమంతకమణితో పాటు జాంబవంతుని కుమార్తె జాంబవతిని కూడా భార్యగా స్వీకరించాడు. తనపైని నీలాపనిందను పోగొట్టుకున్నాడు కృష్ణుడు.

ఆలయంలో మల్లహరి కృష్ణస్వామి శ్రీ కృష్ణుడు) పూజలందుకుంటున్నాడు. ఇటువంటి కృష్ణస్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాలలో మరేచోట లేదు. జాంబవతీ సమేత శ్రీ కృష్ణ ఆలయం రెండు రాష్ట్రాలలో ఇదొకటే కావటం విశేషం. ఇక్కడ రామమందిరం కూడా ఉండటం విశేషం. రెండు ఆలయాలకు విడి విడిగా ధ్వజస్తంభం, బలిపీఠాలు ఉండటం మరీ విశేషం.